కూటమిలో ‘డిప్యూటీ’ కుంపటి! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో ‘డిప్యూటీ’ కుంపటి!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

జనసేన, బీజేపీ ఆశలపై టీడీపీ నీళ్లు

డిప్యూటీ మేయర్‌ పీఠంపై

‘పల్లా’ పట్టు!

మేయర్‌ ముక్కా శ్రావణిని

డమ్మీ చేసే వ్యూహం?

ఎంపీ శ్రీభరత్‌కు చెక్‌ పెట్టే ఎత్తుగడ!

జీవీఎంసీలో మరో పవర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్లాన్‌!

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 98 స్థానాలను కై వసం చేసుకుంది. మేయర్‌ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. అయితే ఇప్పుడు కూటమిలో అసలు రాజకీయ పోరు మొదలైంది. మేయర్‌ పదవి టీడీపీకి దక్కిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌ పదవిపై జనసేన, బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. పొత్తులో భాగస్వాములుగా తాము కూడా మేయర్‌ అభ్యర్థి విజయానికి సహకరించామని, తమకు కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని రెండు పార్టీల కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. అయితే ఈ రెండు పార్టీల ఆశలపై నీళ్లు చల్లుతూ.. డిప్యూటీ మేయర్‌ పదవిని కూడా టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

డిప్యూటీ మేయర్‌పై పల్లా పట్టు

మేయర్‌ పీఠం టీడీపీకి దక్కినప్పటికీ డిప్యూటీ మేయర్‌ పదవిని జనసేన లేదా బీజేపీకి కేటాయిస్తారన్న అంచనాలు మొదటి నుంచీ ఉన్నాయి. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాత్రం డిప్యూటీ మేయర్‌ పదవిని కూడా తమ పార్టీలో యాదవ సామాజిక వర్గ సీనియర్‌ కార్పొరేటర్‌కు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణికి సమాంతరంగా మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌తోనూ మంతనాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంపీకి చెక్‌ పెట్టాలనే వ్యూహం!

మేయర్‌ పదవి ఎంపీ శ్రీభరత్‌ ప్రతిపాదించిన ముక్కాశ్రావణికి దక్కడంతో టీడీపీలో మరో వర్గం గుర్రుగా ఉంది. దీంతో ఎంపీకి చెక్‌ పెట్టాలన్న ఆలోచనతోనే జీవీఎంసీలో మరో పవర్‌ సెంటర్‌ను తయారు చేయాలన్న వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి 98 స్థానాలతో కూటమి అధికార పీఠాన్ని దక్కించుకున్నా.. ఇప్పుడు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల పంపకం కూటమి పార్టీల మధ్య కొత్త వివాదానికి కేంద్రంగా మారింది. మిత్రపక్షాల మధ్య సాగుతున్న ఈ పదవుల పంచాయితీ చివరకు ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

జనసేనలో ఉండి..

టీడీపీకి మద్దతా?

డిప్యూటీ మేయర్‌ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు ఆశిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ వైఖరిపై పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వాలన్న వాదనను ఆయన తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావుకు ఈ పదవి కట్టబెట్టే దిశగా ఆయన మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జనసేన వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేనే టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement