నియామకం రద్దయినా కొనసాగుతున్న అడ్మినిస్ట్రేటర్ పెత్తనం? అధికారాలు లేకున్నా కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు అవినీతి, ఆర్టీఐ ఆరోపణలపై విచారణలు జరిగినా చర్యలు శూన్యం తీర్పు అమలులో ప్రభుత్వ జాప్యం.. అప్పీల్‌కు వెళ్తారంటూ ప్రచారం అధికారుల ఆధిపత్య పోరుతో అస్తవ్యస్తంగా కేజీహెచ్ పాలన
మహారాణిపేట: పేదల పెద్దాసుపత్రి కేజీహెచ్‌లో హైకోర్టు తీర్పు అమలుకే దిక్కులేకుండా పోయిందా? అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ నియామకాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చినా, ఆయన పెత్తనం మాత్రం కొనసాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీర్పు తర్వాత కూడా కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారన్న విమర్శలు ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు, అవినీతి, అక్రమాలు, ఆర్టీఐ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్యలు లేకపోవడం, కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వం తాత్సారం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలకంటే అధికారుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారాలు లేకున్నా ఫైళ్లపై సంతకాలా?
హైకోర్టు తీర్పు తర్వాత అడ్మినిస్ట్రేటర్‌కు పరిపాలనా అధికారాలు ఉండవని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కీలక ఫైళ్లపై సంతకాలు చేయకూడదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు, ఇతర పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లపై బి.వి.రమణ సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీర్పు అమలులో ఉన్నప్పుడు ఈ విధంగా అధికారాలు వినియోగించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
తీర్పుపై అప్పీల్‌కు వెళ్తారా?
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించబోతోందన్న ప్రచారం కేజీహెచ్‌లో జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లినా, ప్రస్తుత తీర్పుపై స్టే ఉత్తర్వులు ఉన్నాయా? లేక తీర్పు అమలు చేయాల్సిందేనా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అప్పీల్ పేరుతో తీర్పు అమలును వాయిదా వేయకుండా ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
రోగుల ప్రయోజనాలు గాలికా?
వేలాది మంది పేద, మధ్యతరగతి రోగులకు వైద్య సేవలందించే కేజీహెచ్‌లో అధికారుల ఆధిపత్య పోరు, పరిపాలనా అనిశ్చితి కొనసాగితే నష్టపోయేది రోగులేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును అమలు చేయడం, సీఎస్‌ఆర్‌ఎంవోకు నిబంధనల ప్రకారం అధికారాలు అప్పగించడం, అడ్మినిస్ట్రేటర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించడం ప్రభుత్వ తక్షణ బాధ్యత. అధికారుల ప్రయోజనాలే ముఖ్యమా? పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ముఖ్యమా? అన్న ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.
విచారణలు ఏమయ్యాయి.. చర్యలేవీ?
అడ్మినిస్ట్రేటర్ రమణపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణలు జరిగి మూడు నెలలు దాటుతున్నా.. నేటికి నివేదికలు, తదుపరి చర్యలపై స్పష్టత లేదని ఉద్యోగులు అంటున్నారు. ఆర్టీఐ అప్పిలేట్ అథారిటీగా వ్యవహరిస్తూ సమాచారాన్ని అందకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఎదురవుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
తీర్పు అమలుకు ఎందుకీ జాప్యం?
కేజీహెచ్‌లో సీఎస్‌ఆర్‌ఎంవోగా డాక్టర్ యు.శ్రీహరి విధులు నిర్వహిస్తుండగా, రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ బి.వి.రమణను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ (నం.25468/2025) దాఖలైంది. జీవో ఎంఎస్ నం.178 (17.10.2023), మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్–2002 నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అక్టోబర్ 30న వెలువరించిన తీర్పులో అడ్మినిస్ట్రేటర్ నియామకాన్ని రద్దు చేస్తూ, ఆసుపత్రి పరిపాలనా అధికారాలు నిబంధనల ప్రకారం సీఎస్‌ఆర్‌ఎంవో పరిధిలో ఉండాలని స్పష్టం చేసినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయినా తీర్పు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డీఎంఈ స్పందించకపోవడానికి కారణాలేమిటని నిలదీస్తున్నారు.


