లాభాల బాటలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

డీసీఐ సీఎండీ కెప్టెన్‌ దివాకర్‌ వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జింగ్‌ సంస్థల్లో ఒకటిగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) అవతరించే సమయం అతి సమీపంలోనే ఉందని కార్పొరేషన్‌ ఎండీ, సీఈవో కెప్టెన్‌ ఎస్‌.దివాకర్‌ స్పష్టం చేశారు. రెండో త్రైమాసిక ఫలితాల్ని మీడియాకు మంగళవారం ఆయన వివరించారు. రెండో త్రైమాసికంలో రూ.7.31 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.34.17 కోట్ల నష్టాన్ని చవిచూశామని, ఇప్పుడు లాభాల్లోకి వెళ్లడం సంస్థ సమర్థవంతమైన నౌకాదళ నిర్వహణ, ఆర్థిక ప్రణాళికలు, కార్యాచరణ నైపుణ్యాలతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. క్యూ–2లో సంస్థ ఎబిట్డా(ఆదాయం) గతేడాదితో పోలిస్తే 58.58 శాతం వృద్ధితో రూ.41.69 కోట్లకు చేరగా, సొంత డ్రెడ్జర్ల నిర్వహణ ఆదాయం 23.08 శాతం పెరిగి రూ.198.66 కోట్లుగా నమోదైందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి గాను కంపెనీ మొత్తం ఆదాయం రూ.568.29 కోట్లకు పెరగగా, నికర లాభం రూ.18.54 కోట్లుగా నమోదైందని తెలిపారు. ఇది గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ.57.51 కోట్ల నష్టం కంటే గణనీయమైన మెరుగుదల కనబరిచామని వివరించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా విద్యుత్‌, ఇంధన ఖర్చులు రూ.101.02 కోట్లకు పెరిగినప్పటికీ, ఖర్చులు తగ్గడం కంపెనీకి కలిసివచ్చిందని వెల్లడించారు. ఈ విజయవంతమైన ఫలితాలపై డీసీఐ చైర్మన్‌ జస్మీత్‌ సింగ్‌ బింద్రా అభినందనలు తెలిపారన్నారు. ఇది టీమ్‌ డీసీఐ నిబద్ధతకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో దేశీయ పోర్టుల అవసరాలను తీరుస్తూ దేశ సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సంస్థ మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కొత్త పోర్టుల్లో కార్యకలాపాల నుంచి రిజర్వాయర్లు, ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతల్లో డీసీఐ తనదైన ముద్ర వేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో 11 డ్రెడ్జర్లని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఇటీవల జరిగిన మారిటైమ్‌ సదస్సులో డీసీఐ కుదుర్చుకున్న ఒప్పందాలు అమల్లోకి తెచ్చేందుకు రోడ్‌మ్యాప్‌ సిద్ధమైందని కెప్టెన్‌ దివాకర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement