ఇది కోతల ప్రభుత్వమే..! | - | Sakshi
Sakshi News home page

ఇది కోతల ప్రభుత్వమే..!

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

కౌంటింగ్‌ సిబ్బంది పారితోషికంలోనూ జీవీఎంసీ కోతలు జీవోకు విరుద్ధంగా సిబ్బందికి తక్కువ చెల్లింపులు సూపర్‌వైజర్‌కు రూ.2 వేలకు బదులు రూ.1,000 అసిస్టెంట్‌కు రూ.1,350కు బదులు రూ.900 అడిగితే దురుసు సమాధానాలు.. అధికారులపై ఉపాధ్యాయుల ఫిర్యాదు నిబంధనల ప్రకారం చర్యలకు ఈసీ ఆదేశం

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల విధులు అనగానే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అదొక గుదిబండ. ఎంతో బాధ్యతగా, రాత్రింబవళ్లు కష్టపడి కౌంటింగ్‌ విధులు నిర్వహిస్తే.. వారికి దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కకుండా పోయింది. జీవీఎంసీ మేయర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వర్తించిన సిబ్బందికి నిర్ణయించిన పారితోషికాన్ని కాకుండా.. ఇష్టారాజ్యంగా కోత విధించి.. ఇది కోతల ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేసింది. రావాల్సిన పూర్తి మొత్తం ఇవ్వాలని అడిగిన సిబ్బందిపై జీవీఎంసీ అధికారి దురుసుగా ప్రవర్తించడంపై ఒక ఉపాధ్యాయుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఇంత తీవ్రమైన అంశంపై ఈసీ స్పందించిన తీరు కూడా విస్మయం కలిగిస్తోంది.

జీవోలో ఓ లెక్క.. చెల్లింపుల్లో మరో లెక్క!

జీవో నం.1345 ప్రకారం కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కు రోజుకు రూ.500 లేదా మొత్తంగా రూ.2,000, అసిస్టెంట్‌కు రూ.1,350 పారితోషికం చెల్లించాలి. కానీ, జీవీఎంసీ అధికారులు సూపర్‌వైజర్‌కు రూ.1,000, అసిస్టెంట్‌కు రూ.900 మాత్రమే చెల్లించారు. అంటే ఒక్కో సూపర్‌వైజర్‌కు రూ.1,000, అసిస్టెంట్‌కు రూ.450 చొప్పున కోత పెట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న మొత్తాన్ని తగ్గించి చెల్లించే అధికారం అధికారులకు ఎవరిచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అడిగితే దురుసు సమాధానాలు

పారితోషికంలో కోతను గుర్తించిన ఉపాధ్యాయులు కౌంటింగ్‌ రోజే జీవీఎంసీ నార్త్‌ జోన్‌ పరిధిలో నిరసన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం పూర్తి మొత్తం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన సంబంధిత జోన్‌ ఉన్నతాధికారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘వెళ్లి మీకు దిక్కున్నచోట, మీకు సహాయం చేయగలరని అనుకునే వారికి ఫిర్యాదు చేసుకోండి’ అంటూ వ్యాఖ్యానించినట్లు బాధితులు పేర్కొన్నారు. దీంతో తమకు న్యాయం చేయాల్సిన అధికారులే అవమానిస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసీకి ఫిర్యాదు.. స్పందన నామమాత్రం

అధికారుల తీరుపై విసిగిపోయిన వైవీ సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడితో పాటు మరికొందరు కౌంటింగ్‌ సిబ్బంది ఈ నెల 3న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన మిగిలిన రూ.1,000 చెల్లించడంతోపాటు, అర్హులైన సిబ్బంది అందరికీ జీవో ప్రకారం పూర్తి పారితోషికం అందేలా ఆదేశించాలని కోరారు. అధికారుల దురుసు ప్రవర్తనను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదుపై ఈ నెల 4న స్పందించిన ఏపీ ఎస్‌ఈసీ జాయింట్‌ డైరెక్టర్‌ రామారావు జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. ఫిర్యాదు ప్రతిని జతచేస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి పారితోషికంలో కోత విధించిన అధికారుల నుంచి వివరణ కోరడం, ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించడం వంటి చర్యల ప్రస్తావన లేకపోవడంపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని లేఖ రాయడమే కాకుండా.. సిబ్బందికి పూర్తి పారితోషికం ఇప్పించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికల సంఘంపై ఉద్యోగులకు నమ్మకం కలుగుతుందని వారు అంటున్నారు.

కమిషనర్‌కు, ఫిర్యాదుదారుకి వచ్చిన ఈసీ సమాధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement