అల్లిపురం: ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 నేపథ్యంలో నగరాన్ని అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా సుందరీకరిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మంగళవారం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న సమ్మిట్ ప్రధాన వేదికను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారుల మధ్యనున్న సెంటర్ మీడియన్లలో మొక్కల పెంపకం, జంక్షన్ల సుందరీకరణ, ఫౌంటైన్ల ఏర్పాటు, బీచ్‌రోడ్డు పరిసరాల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, రంగులద్దే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు, పర్యాటక ప్రాంతాల్లో నిరంతర పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమ్మిట్ నేపథ్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం తాత్కాలిక అలంకరణలకే పరిమితం కాకుండా నగర ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు.


