మూడు దుకాణాల్లో తనిఖీలు.. రూ.1.25 లక్షల జరిమానా
ద్వారకా నగర్: బియ్యం విక్రయాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని బియ్యం రిటైల్, హోల్‌సేల్ దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మూడు వ్యాపార సంస్థల్లో పలు ఉల్లంఘనలను గుర్తించి ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో ఐదు కేసులకు సంబంధించి రూ.1.25 లక్షల జరిమానా విధించారు. రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. తొలుత శ్రీ మణికంఠ రైస్ ట్రేడర్స్‌లో 10 కిలోల సుందర రత్న ప్రీమియం సోనా రైస్ బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 17 బస్తాలపై ఎంఆర్‌పీ, ప్యాకింగ్ తేదీలు మార్చినట్లు గుర్తించారు. ప్రదీప్ ట్రేడర్స్ అండ్ జనరల్ స్టోర్స్‌లో తనిఖీలు నిర్వహించగా, 26 కిలోల సార్టెక్స్ 999 గోల్డ్ బాయిల్డ్ రైస్ ఐదు బస్తాలపై తయారీదారు పేరు, చిరునామా ముద్రించకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంకట లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో తనిఖీల సందర్భంగా ప్యాకేజింగ్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న భారీ మొత్తంలో బియ్యం బస్తాలను గుర్తించారు. సార్టిక్స్ 999 గోల్డ్ బాయిల్డ్ రైస్ 17 బస్తాలు, గోకుల్ సటాకే ప్రీమియం రైస్ 8 బస్తాలు, కిసాన్ బ్రాండ్ జై శ్రీరామ్ లచ్చకరి రైస్ 450 బస్తాలపై ప్యాకర్ పేరు, చిరునామా ముద్రించకుండా ఉన్నట్లు గమనించారు. ప్యాకేజ్డ్ వస్తువుల నిబంధనలను ఉల్లంఘించినందుకు లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం మొత్తం ఆరు కేసులు నమోదు చేసి, జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.


