మల్కాపురం : స్వీట్స్ కొనడానికి ఆ షాపులో అడుగుపెడితే ముందుగా కనిపించేవి కాకరపువ్వొత్తులు, సిసింద్రీలు, భూచక్రాలు, సీమ టపాకాయలు..ఒక్క క్షణం బాణసంచా కేంద్రంలోకి వచ్చామేమో అనిపిస్తుంది. కానీ ఇది టపాసుల దుకాణం కాదు సుమా, పక్కా స్వీట్ స్టాల్. దీపావళి సందర్భంగా కోవాతో రకరకాల బాణసంచా నమూనాలను తీర్చిదిద్ది, వాటినే స్టాల్‌లో కొలువుదీర్చారు.
ప్రతి పండుగకో ప్రత్యేకత
80వ వార్డు శ్రీహరిపురం ప్రధాన మార్గం పక్కనే ఉన్న శ్రీనివాస్ స్వీట్ స్టాల్‌ను దున్న ప్రతాప్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని మిగిలిన స్వీట్ షాపులకు భిన్నంగా, ఈయన ప్రతి ఏటా ఏదో ఒక వినూత్న ప్రయోగం చేస్తుంటారు. సంక్రాంతి వస్తే తెలుగువారు ఇష్టపడే సంప్రదాయ వంటకాలు, దసరా వస్తే ఆ వేడుకకు తగ్గ మిఠాయిలు.. ఇలా సందర్భాన్ని బట్టి స్వీట్లు తయారుచేయడం ఆయన ప్రత్యేకత. ఈ దీపావళికి స్వీట్ కోవాతో రకరకాల బాణసంచా ఆకారాలను రూపొందించారు. ఇవి చూసిన కొనుగోలుదారులు వాటిపై మోజు పడి, బాణసంచా ఆకృతుల్లో ఉన్న కోవా స్వీట్లను ఏరికోరి కొంటున్నారు. ‘తినడానికి ముందు చూడటానికే ముచ్చటగా ఉన్నాయి’ అంటున్నారు వినియోగదారులు.
సిబ్బందీ సంప్రదాయ వేషంలో..
ఆకర్షణ స్వీట్లతోనే ఆగలేదు. ఇక్కడి సిబ్బంది రోజూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, కొనుగోలుదారులకు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. దీపావళి రోజుల్లో ప్రతి సాయంత్రం షాపు వద్ద సిబ్బందితో కలిసి నిజమైన బాణసంచా కాల్చి, పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తున్నారు. మొత్తానికి, మిఠాయిని టపాసులా, టపాసును మిఠాయిలా మార్చిన ఈ ప్రయోగంతో శ్రీనివాస్ స్వీట్ స్టాల్ ఈ దీపావళికి శ్రీహరిపురంలో అందరి నోళ్లలో నానుతోంది. ఇక్కడ పేలేది టపాసులు కాదు, నోట్లో కరిగే కోవా రుచులే.
ఇవన్నీ స్వీట్లే
శ్రీహరిపురంలో కోవా టపాసుల సందడి
చిచ్చుబుడ్డి.. భూచక్రాల స్వీట్స్
1000 వాలా స్వీట్


