మహారాణిపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. మూడో విడతలో విశాఖ జిల్లాను కేటాయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
డిసెంబర్ 2న పోలింగ్
మూడో విడత ఎన్నికల్లో భాగంగా నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2న జిల్లాలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 79 పంచాయతీలు ఉండగా.. మొత్తం 1,62,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 82,737 మంది మహిళలు, 79,630 మంది పురుషులు ఉన్నారు. పోలింగ్ కోసం 802 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
79 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
భీమిలి మండలంలో 16 సర్పంచ్‌లు, 166 వార్డు సభ్యులు, పద్మనాభం మండలంలో 22 సర్పంచ్‌లు, 226 వార్డు సభ్యులు, ఆనందపురం మండలంలో 26 సర్పంచ్‌లు, 260 వార్డు సభ్యులు, పెందుర్తి మండలంలో 15 సర్పంచ్‌లు, 150 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యాహ్నం నుంచే ఓట్ల లెక్కింపు
ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 1 గంట నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గ్రామాల్లో రాజకీయ సందడి ఊపందుకోనుంది.


