విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ మైదానంలో దీపావళి టపాసుల విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల క్రీడా కార్యకలాపాలకు ఉపయోగించాల్సిన మైదానాన్ని టపాసుల విక్రయాలకు కేటాయించడం వెనుక పెద్ద వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఒత్తిడితోనే ఏయూ యంత్రాంగం మైదానాన్ని కేటాయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
అద్దె కంటే ఆదాయమే ఎక్కువ?
ఏయూ మైదానాన్ని టపాసుల విక్రయాలకు అద్దెకు ఇచ్చేందుకు సుమారు రూ.18 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కూటమి నేతల అనుబంధ వ్యక్తికే కాంట్రాక్టు దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం స్థానిక కార్పొరేటర్ జోక్యం పెరిగిందని, ఆయన సిఫారసుతోనే స్టాళ్ల కేటాయింపులు జరిగాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం 70 వరకు స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో స్టాల్‌కు సుమారు రూ.1.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వర్సిటీకి చెల్లించిన అద్దెతో పోలిస్తే కాంట్రాక్టర్‌కు రూ. 84 లక్షల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విక్రయాల అనంతరం మైదానాన్ని యథాస్థితికి తీసుకురావడానికి అయ్యే ఖర్చు కూడా వర్సిటీపై పడే అవకాశం ఉందని అంటున్నారు.
భద్రతపై ఆందోళన
ఏయూ సిల్వర్ జూబ్లీ మైదానంలో టపాసుల విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైదానం చుట్టూ పలు వసతిగృహాలు ఉన్నందున అగ్నిప్రమాదాలు జరిగితే విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఏయూ పరిరక్షణ సమితి కన్వీనర్ డా. మీనన్ పేర్కొన్నారు. గతంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానాన్ని అద్దెకు ఇచ్చిన తర్వాత పునరుద్ధరణకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. గోల్డెన్ జూబ్లీ మైదానంలో టపాసుల విక్రయాలకు అనుమతులు ఇవ్వడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై కలెక్టర్, ఏయూ వీసీ దృష్టి సారించాలని డిమాండ్ చేసింది.


