మహారాణిపేట: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. అనంతరం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలింగ్‌కు 48 గంటల ముందు బహిరంగ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత మైకులు వినియోగించడం, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అదే నెల 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.


