వణికిస్తున్న
● విశాఖపై అతి తీవ్ర తుపాను ప్రభావం
● ఎడతెరిపిలేని వర్షం.. అస్తవ్యస్తంగా నగర జీవనం
● పలుచోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.. ధ్వంసమైన వాహనాలు
● పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
తీరంలో తుఫాను ఉధృతికి నిదర్శనం
సాక్షి, విశాఖపట్నం: అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖ వణికిపోతోంది. ఉదయం నుంచి వీచిన బలమైన గాలులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగి వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలి, తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాలు చీకట్లో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 120 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ అలలు ఎగసిపడుతున్నాయి. తుపాన్ తీవ్రత పెరిగే సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నేలకొరిగిన వృక్షాలు: భీకర గాలులకు అంగడిదిబ్బ, సీతంపేట, గురుద్వార, సీతమ్మధార, అక్కిరెడ్డిపాలెం, అక్కయ్యపాలెం, ఆరిలోవ, పెదగంట్యాడ, గాజువాక, మల్కాపురం, పెదగదిలి, పెదవాల్తేరు, శివాజీపాలెం, మద్దిలపాలెం, సత్యం జంక్షన్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. వాటి కింద నిలిపిన బైక్‌లు, ఆటోలు, కార్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కరెంట్ కష్టాలు.. స్పందనేది?
తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని, విద్యుత్ సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఈపీడీసీఎల్ అధికారులు ముందుగా ప్రకటించారు. అయితే సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ కోసం ఫోన్లు చేసినా స్పందన లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొండవాలు, లోతట్టు ప్రాంతాలపై నిర్లక్ష్యం!
భారీ వర్షాలు, బలమైన గాలులపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ వాగులు, గెడ్డల్లో పూడిక తొలగింపు, వరద నీటి ప్రవాహానికి అడ్డంకుల తొల గింపు పనులు పూర్తిస్థాయిలో జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోడ్లు, వీధుల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. కొండవా లు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలోనూ జాప్యం జరిగిందనే ఆరోపణలున్నాయి. వర్ష తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల కుటుంబాలను సహాయక కేంద్రాలకు తరలించారు.
తెగిపడిన విద్యుత్ వైర్లు.. వృద్ధుడి మృతి
విశాఖ విద్య: తుపాను వేళ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపాలెం గ్రామానికి చెందిన అమర పిని దేవుడు (65) వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ వైర్లు ఉన్న విషయం తెలియక అడుగుపెట్టడంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.


