మేయర్‌గా అవకాశం ఇస్తే ప్రతి వార్డులో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, తాగునీరు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
విశాఖ బార్ అసోసియేషన్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి
వరుదు కల్యాణి
అల్లిపురం: విశాఖ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌ను సందర్శించి న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఒమ్మి సన్యాసిరావు, ఒమ్మి సుధాకర్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ బీవీఆర్ మూర్తి, మాజీ వైస్ చైర్మన్ కృష్ణమోహన్ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థుల అర్హతలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతను పరిశీలించి ఓటు వేయాలని న్యాయవాదులను కోరారు. తాను బాపట్లలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, విశాఖలో ఎల్‌ఎల్‌బీ చదివినట్లు తెలిపారు.
విశాఖ ప్రజల ఆస్తులను కాపాడుకోవాలి
విశాఖలో విలువైన ప్రభుత్వ భూముల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 54 ఎకరాల భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మేయర్‌గా ఎన్నికై తే దీనిని అడ్డుకునేందుకు కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెడతానన్నారు.
జీవీఎంసీ నిధులు విశాఖ అభివృద్ధికే..
విశాఖ ప్రజలు చెల్లిస్తున్న పన్నులను నగర మౌలిక సదుపాయాల కల్పనకే వినియోగించాలని ఆమె డిమాండ్ చేశారు. జీవీఎంసీకి సంబంధించిన రూ.1,750 కోట్లను అమరావతి అభివృద్ధికి మళ్లించారని ఆరోపించారు. మేయర్‌గా ఎన్నికై తే నగరానికి రావాల్సిన నిధులను తిరిగి రాబట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు.
ప్రతి వార్డులో ప్రజల వద్దకే పాలన
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులతో కలిసి ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానన్నారు. వెంటనే పరిష్కరించగలిగిన వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కర్ణం కృష్ణ, కాండ్రేగుల జగదీశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఉదా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బాజీనాయుడు, ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి అనిల్‌కుమార్, నీలకంఠ సంతోష్‌కుమార్, బగాది తులసీదాస్, ఆరిపాక రామకృష్ణ, నైదాన వేణుగోపాలరావు, వాగుపల్లి చెన్నారావు, ఆర్.ఎస్.రవి, రమణ ప్రభాస్, బలగా సత్యారావు, గోవింద్, జఫర్ ఉన్నిసా, సూరంపూడి శ్రీనివాసరావు, వెంకట కుమార్ పాల్గొన్నారు.
న్యాయవాదుల
సూచనలు తీసుకుంటా
నగరాభివృద్ధికి న్యాయవాదులు, నిపుణులు, మేధావుల సలహాలు తీసుకుంటానని వరుదు కల్యాణి చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జూనియర్ న్యాయవాదులకు అందించిన రూ.5 వేల ఆర్థిక సాయం ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. విశాఖ అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని, జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.


