గెలిపిస్తే.. గీతం భూములపై తొలి తీర్మానం! | - | Sakshi
Sakshi News home page

గెలిపిస్తే.. గీతం భూములపై తొలి తీర్మానం!

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

రూ.5 వేల కోట్ల విలువైన ఆక్రమిత

భూములను వెనక్కి తీసుకుంటాం

స్టీల్‌ప్లాంట్‌, సింహాచలం కొండల

పరిరక్షణకు జీవీఎంసీ వేదికగా పోరాటం

కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాకే

ఓట్లు అడగాలి

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి,

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌గా వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే గీతం సంస్థ ఆక్రమించినట్లు ఆరోపిస్తున్న రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకునేలా తొలి తీర్మానం చేస్తామని వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతోపాటు సింహాచలం కొండల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నగర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు

ఈ ఎన్నికలు కేవలం మేయర్‌ పదవికి సంబంధించినవి మాత్రమే కావని, విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, నగర భవిష్యత్తు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు సంబంధించినవని ఆమె పేర్కొన్నారు. బీసీ మహిళగా, విశాఖ ప్రజల ఇంటి ఆడబిడ్డగా నగరానికి సేవ చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలు తనకు బాధ్యత అప్పగిస్తే పారదర్శకమైన, అవినీతిరహిత పాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు.

120 డివిజన్లలో సమాన అభివృద్ధి

విశాఖను దేశంలోని మొదటి ఐదు నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని 120 డివిజన్ల ప్రజల అవసరాలను గుర్తించి, అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడంతోపాటు భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భూముల పరిరక్షణకు తీర్మానాలు

విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని, పేదల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. మేయర్‌గా అవకాశం కల్పిస్తే గీతం భూముల అంశంతోపాటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సింహాచలం అప్పన్న భూములు, కొండల పరిరక్షణకు సంబంధించి జీవీఎంసీ వేదికగా తీర్మానాలు ప్రవేశపెడతానన్నారు.

సింహాచలం కొండల పరిరక్షణకు చర్యలు

సింహాచలం అప్పన్న కొండలపై తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కొండలపై జరుగుతున్న తవ్వకాలు, తగ్గుతున్న పచ్చదనంపై సమగ్ర పరిశీలన జరిపి, పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఆ ప్రాంతాన్ని తిరిగి సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో తాగునీటి నిల్వలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం, నీటి లభ్యత, సరఫరా వ్యవస్థలోని లోపాలను సమీక్షించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు.

కాలుష్య నియంత్రణ.. పచ్చదనం పెంపు

వన్‌టౌన్‌, గాజువాక, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకుని సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రీన్‌బెల్ట్‌ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నగరంలో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య మెరుగుదల, చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీరు నిలిచిపోయే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు మురికివాడల్లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

పార్కులు, హెల్త్‌ ఎరీనాల అభివృద్ధి

జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తానని ఆమె వెల్లడించారు. కాలనీల్లో పార్కులు, యోగా ప్రదేశాలు, వ్యాయామ సదుపాయాలతో హెల్త్‌ ఎరీనాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీచ్‌ల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ కోసం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం

కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మహిళలు, యువత భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె విమర్శించారు. మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగే నగరంగా విశాఖను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాల లభ్యతను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

హామీల అమలుపై నిలదీత

కూటమి ప్రభుత్వం విశాఖకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభివృద్ధి కార్యాచరణను వివరించారు. విశాఖ శ్రేయస్సు, నగర అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement