ఆనందపురం మండలం
తర్లువాడలో చుక్క కొండ
ఐటీ హిల్స్–3లోని ఓ కొండ
ఊరికొండ
ఎండాడ సమీపంలో పెద్దకొండపై అక్రమ తవ్వకాలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరానికి ప్రాణవాయువును అందించే పచ్చని తూర్పు కనుమలు కూటమి ప్రభుత్వ హయాంలో కనుమరుగవుతున్నాయి. ఆనందపురం నుంచి అగనంపూడి వరకు అభివృద్ధి, పరిశ్రమల ముసుగులో కొండలను తవ్వి పిండి చేస్తున్నారు. నగరంలో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అనుయాయులకు కారుచౌకగా భూములను అప్పగిస్తుండటంతో విశాఖ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ముక్కలవుతున్న కొండలు.. రియల్ రాబందుల కన్ను
మధురవాడలోని కొరి కొండ, చవ్వ కొండ, ఊరి కొండ, పావురాల కొండ, అప్పన్న కొండ, తర్లువాడ కొండతో సహా నగర పరిధిలోని దాదాపు పది ప్రధాన కొండలను రిసార్టులు, హోటళ్లు, ఇతర ప్రాజెక్టుల పేరిట అప్పనంగా కట్టబెడుతున్నారు. భీమిలి నియోజకవర్గం తర్లువాడ కొండను ఇప్పటికే సగానికి పైగా కరిగించేశారు. గతంలో ఇక్కడి కొండలపై విష్ణుపాగాలు ఉన్నాయని, కొండల కేటాయింపులపై గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా.. ఇప్పుడు సగం కొండ కనుమరుగవుతున్నా నోరు మెదపకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
అప్పన్న కొండకే ఎసరు.. నీటి గండంలో నగరం
నగర నడిబొడ్డున ఉన్న సింహాచలం అప్పన్న కొండ భూములను సైతం డేటా సెంటర్ కోసం 160 ఎకరాలు అప్పగించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించిన ఈ కొండల నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవ జలాశయానికి చేరేలా గతంలో ప్రత్యేక చప్టాలు నిర్మించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల వల్ల ఈ నీటి ప్రవాహం నిలిచిపోయి, ముడసర్లోవ నీటి సేకరణ దెబ్బతినడంతో పాటు చుట్టుపక్కల కాలనీలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది.
నగరాన్ని కమ్మేస్తున్న కాలుష్యం
ఒకవైపు పోర్టు వల్ల వస్తున్న కాలుష్యాన్ని పీల్చుకుంటూ విశాఖకు ఊపిరితిత్తుల్లా నిలుస్తున్న తూర్పు కనుమలను పిండి చేయడంతో పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రాణవాయువును ఇచ్చే కొండలకు గుండు కొడుతుండటంతో రాబోయే రోజుల్లో నగర ప్రజలు తీవ్రమైన వాతావరణ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
సింహాచలం కొండ
భీమిలి బీచ్ సమీపంలో పావురాల కొండ వద్ద తవ్వకాలు


