మళ్లీ ‘రివర్స్‌’ తీర్పేనా? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘రివర్స్‌’ తీర్పేనా?

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

26 ఏళ్ల తర్వాత మేయర్‌ ప్రత్యక్ష పోరు

1995, 2000 నాటి చరిత్రపై చర్చ

స్థానిక సమస్యలు, సామాజిక

సమీకరణాలే కీలకం

ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ దూకుడు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార పీఠంపై ఏ పార్టీ ఉందన్నదానితో సంబంధం లేకుండా.. విశాఖ ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పునిస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కట్టిన సాగరతీర ప్రజలు.. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పీఠాన్ని మాత్రం ప్రతిపక్షానికి కట్టబెట్టడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. సుదీర్ఘమైన 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ.. నాటి సంచలన రాజకీయ చరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది.

రెండుసార్లు అధికారపక్షానికి షాక్‌

జీవీఎంసీ మేయర్‌ పదవికి గతంలో కేవలం మూడుసార్లు (1987, 1995, 2000) మాత్రమే ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.

1987: ఎన్‌టీఆర్‌ ప్రభంజనం, ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావు అభ్యర్థిత్వంతో టీడీపీ విజయం సాధించింది.

1995 – 2000: రాష్ట్రంలో టీడీపీ అధికారంలో, చంద్రబాబు సీఎంగా బలమైన పాలన సాగిస్తున్నప్పటికీ.. విశాఖ ఓటర్లు మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్‌కే జై కొట్టారు. 1995లో సబ్బం హరి ఘనవిజయం సాధించగా, 2000 సంవత్సరంలో తొలి మహిళా మేయర్‌గా రాజాన రమణి భారీ మెజారిటీతో గెలుపొందారు.

పార్టీ గుర్తుల కంటే అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్‌, సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలే ఇక్కడ తీర్పును శాసించాయని ఈ ఫలితాలు నిరూపించాయి.

అనుభవం వర్సెస్‌ రాజకీయ అండదండలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణి ఎమ్మెల్సీగా, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవాన్ని ముందుకు తెస్తున్నారు. నగర సమస్యలు, పరిపాలనపై తనకున్న అవగాహన కలిసొస్తుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కా శ్రావణి గతంలో 26వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేశారు. ఎంపీ భరత్‌ మద్దతుతో ఆమె బరిలోకి దిగారు. 120 వార్డులు, సుమారు 18.37 లక్షల మంది ఓటర్లున్న విశాఖలో నగరవ్యాప్త సమస్యలపై అవగాహన, ప్రజాదరణ, పార్టీ శ్రేణుల సమన్వయం కీలకం కానున్నాయి. ఈ అంశాల్లో తమ అభ్యర్థికి పైచేయి ఉంటుందని వైఎస్సార్‌సీపీ ప్రచారం చేస్తోంది.

బీసీ ఓట్లపై గురి

సామాజిక సమీకరణాలు కూడా ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2000లో యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజాన రమణి విజయం సాధించగా, 2021లో వైఎస్సార్‌సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వరుదు కల్యాణి తన రాజకీయ అనుభవంతోపాటు సామాజిక నేపథ్యాన్ని కూడా ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కూటమిలోని కొన్ని వర్గాల్లో ఉందన్న చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు ఓట్ల సమీకరణాలపై ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల అంచనా. అయితే తుది నిర్ణయంలో అభ్యర్థుల వ్యక్తిగత ఆదరణ, స్థానిక సమస్యలే కీలకం కానున్నాయి.

‘సేవ్‌ వైజాగ్‌’తో ప్రజల్లోకి..

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ రద్దు, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, ఉక్కు కర్మాగార పోరాటం, అస్తవ్యస్త పారిశుధ్యం, తాగునీటి ఎద్దడి వంటి స్థానిక సమస్యలపై పాలకవర్గం వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ ఎలుగెత్తి చాటుతోంది. నగర వనరులు, అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రతిపక్ష మేయర్‌ ఉండాలనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే.. గత రెండు దశాబ్దాల నాటి ‘రివర్స్‌ ట్రెండ్‌’ ఈసారి కూడా పునరావృతమై అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement