అంధ ఉపాధ్యాయులకు ఎన్నికల విధులా? | - | Sakshi
Sakshi News home page

అంధ ఉపాధ్యాయులకు ఎన్నికల విధులా?

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

విశాఖ విద్య: జీవీఎంసీ ఎన్నికల విధులకు సిబ్బంది నియామకంలో అధికారుల వ్యవహారశైలి విమర్శలకు దారితీస్తోంది. అంధులైన ఉపాధ్యాయులకు సైతం పోలింగ్‌, ఇతర ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దివ్యాంగుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా విధులు కేటాయించడం సరికాదని పేర్కొంటున్నాయి.

అందిన ఆదేశాలతో అవాక్కు

సిబ్బంది నియామకంలో నిశిత పరిశీలన లేకుండా ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. శిక్షణ తరగతులకు హాజరుకావాలని పలువురు ఉపాధ్యాయులకు లేఖలు అందాయి. వాటిని చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. గాజువాక పరిధిలో పలువురు ఉపాధ్యాయులకు ఇలాంటి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు పప్పు వరలక్ష్మి, వేపాడ విజయమాధవి, చిరికి సురేష్‌ పూర్తిగా అంధులైనప్పటికీ వారికి ఎన్నికల విధులకు హాజరుకావాలని ఆదేశాలు అందాయి. గాజువాక ఎంఈవో పేరుతో వచ్చిన ఈ ఆదేశాల మేరకు శిక్షణకు హాజరుకావాలని సూచించారు. తమ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే విషయం పరిశీలనకు వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

పారదర్శకతపై ప్రశ్నలు

ఇప్పటికే విభజన, రిజర్వేషన్ల అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులు.. సిబ్బంది నియామకంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సమర్థులైన సిబ్బందిని నియమించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు.

జీవీఎంసీ ఎన్నికల సిబ్బంది

నియామకంపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement