వరుస ఘటనలు.. వణికుతున్న నగరం
ఎన్నికల వేళ
నేరగాళ్ల హల్‌చల్
ద్వారకా నగర్ : నగరంలో వరుస నేర ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు జీవీఎంసీ ఎన్నికల సందడి నెలకొనగా.. మరోవైపు అర్ధరాత్రి వేళ కత్తులతో దాడులు, భారీ నగదు దోపిడీలు, హత్యలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. నేరాల నియంత్రణకు పోలీసుల నిఘా, రాత్రి గస్తీ ఎంత పటిష్టంగా ఉందన్న చర్చ సాగుతోంది.
కంచరపాలెంలో కార్మికులపై కత్తులతో దాడి
కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు కార్మికులపై కత్తులతో దాడి చేశారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ జరిగిన వాగ్వాదం దాడికి దారితీసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ షాకీబ్, సాలం షేక్ తీవ్రంగా గాయపడ్డారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కొని నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రూ.70 లక్షలకు పైగా నగదు దోపిడీ
ఇటీవల ద్వారకానగర్‌లో నగదు మార్పిడి పేరుతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, సచివాలయ ఉద్యోగినిని లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీ జరిగింది. ఈ ఘటనలో రూ.70 లక్షలకు పైగా నగదును దుండగులు అపహరిం చారు. భారీ మొత్తంలో నగదు దోపిడీ జరగడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుల ఆచూకీ, దర్యాప్తు పురోగతిపై స్పష్టత రావాల్సి ఉంది.
బంగారం కోసం వృద్ధురాలి హత్య?
కంచరపాలెం పట్టాభిరెడ్డి తోటలో బంగారం కోసం 79 ఏళ్ల వృద్ధురాలు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమెను లక్ష్యంగా చేసుకుని సమీప నివాసి ముందుగా రెక్కీ నిర్వహించి ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి పిల్లలు అమెరికాలో ఉంటుండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మృతదేహం రెండు, మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో బంగారం కోసమే హత్య జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎన్నికల వేళ నిఘా ఎంత పటిష్టం?
ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు కీలక సవాలుగా మారింది. సున్నిత ప్రాంతాల్లో గస్తీ, రాత్రివేళ తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అనుమానితుల కదలికలపై నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఒక ఘటన మరువకముందే మరో నేరం వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటనల అనంతరం దర్యాప్తుతో పాటు ముందస్తు నిఘా, సమర్థవంతమైన గస్తీ, నిందితులపై వేగవంతమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వేళ నగర భద్రత పోలీసు యంత్రాంగానికి కీలక పరీక్షగా మారింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు


