మహారాణిపేట: జిల్లాలో జరగనున్న గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎ. భార్గవ్ తేజ్, వ్యయ పరిశీలకుడు పి. వెంకట సందీప్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ విద్యాధరి, స్థానిక అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థుల వ్యయంపై నిరంతరం నిఘా ఉంచాలని పరిశీలకులు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో శిక్షణను పరిశీలించిన పరిశీలకులు
పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు భార్గవ్ తేజ్, సందీప్ రెడ్డి పరిశీలించారు. జేసీ విద్యాధరితో కలిసి శిబిరాన్ని సందర్శించిన వారు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.ఎంసీసీ, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ తదితర బృందాలకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.


