బీచ్‌రోడ్డు: నగరంలో మత్తు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి గురువారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ, చినవాల్తేరు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎవ్వవరం గ్రామానికి చెందిన అద్దేపల్లి మధు (26) నుంచి కిలో హాష్ ఆయిల్, ఏపీ40 ఎల్‌క్యూ 7743 నంబర్ గల బలెనో కారు, రూ.10 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గాజువాక పెదగంట్యాడ బీసీ రోడ్డుకు చెందిన పట్నాల వెంకట శివప్రసాద్ (28) నుంచి 20 గ్రాముల ఎండీఎంఏ, రూ.10 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన తిప్పల విద్యాసాగర్ (31) నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ గుర్తించామన్నారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమావేశంలో త్రీటౌన్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


