కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఒక్కసారిగా మండిపోతూ సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు, పంచదార ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకవైపు ప్రజా ధనాన్ని అమరావతికి మళ్లిస్తూ, కార్పొరేట్లకు భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటుతోనే తగిన బుద్ధి చెబుతాం.
– రమేష్, ఎల్‌వీ నగర్,
సాక్షి, విశాఖపట్నం : సామాన్యుడి కంచంలోకి వెళ్లే కిలో బియ్యం వంద రూపాయలకు దొరకని పరిస్థితులు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. బడా సంస్థలకు మాత్రం ఎకరాల ఎకరాల భూములు కేవలం 99 పైసలకే దొరుకుతున్నాయి. పండగ పూట పప్పన్నం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే.. సగటు మనిషి భయపడే రోజుల్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. బియ్యం, ఉప్పు, పప్పు, పంచదార, కూరగాయలు.. ఇవన్నీ నిత్యావసరాలే అయినా.. ఈ ప్రభుత్వం దయవల్ల అవన్నీ ఖరీదైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి.
ఎప్పుడు మైక్ దొరికినా.. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ఊదరగొట్టే చంద్రబాబు మాటల వెనుక ఆంతర్యం ఏంటనేది విశాఖ ప్రజలకు అవగతమైందని విశాఖ ప్రజలకు అవగతమైంది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చాక ప్రజా సంపదను నచ్చిన సంస్థలకు అప్పనంగా దోచిపెడుతూ, తమకు నచ్చిన విధంగా సంపదను సృష్టించుకోవడమేనా బాబు చెప్పిందంటూ నగర వాసులు మండిపడుతున్నారు.
విశాఖ సంపదను దోచేయొద్దు
‘మీరు సంపద సృష్టించొద్దు.. విశాఖ సంపదను దోచేయొద్దు’ అంటూ గ్రేటర్ ఎన్నికల వేళ ఓట్ల కోసం వస్తున్న అధికార పార్టీ నేతలను చూసి నగర ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. ‘సేవ్ వైజాగ్’ నినాదంతో అధికార కూటమి కబంధ హస్తాల నుంచి తమ నగరాన్ని కాపాడుకునేందుకు, బ్యాలెట్‌నే ఆయుధంగా మలచుకుంటూ తగిన బుద్ధి చెప్పేందుకు విశాఖ ఓటర్లు సన్నద్ధమవుతున్నారు.
ఉత్తుత్తి కంపెనీకి రూ.వేల కోట్ల భూములు
ఊరూపేరు లేని ఉత్తుత్తి కంపెనీ ఉర్సాకు రూ. వేల కోట్ల విలువైన నగర భూములను 60 ఎకరాల వరకు పళ్లెంలో పెట్టి ఇచ్చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్ ధరకే భూములు కొనుగోలు చేసుకుంటూ సంస్థలను విస్తరిస్తున్న టీసీఎస్‌కు 21 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 21 ఎకరాలు, ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల చొప్పున.. దొరికిన భూములను దొరికినట్లుగా కేటాయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.
నిలదీస్తున్న ప్రజలు
జీవీఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కూటమి నేతలకు అడుగడుగునా పరాభవం ఎదురవుతోంది. ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఓటర్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటేనని పేర్కొంది. ‘అసలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారు? అంటూ రెండేళ్ల ముందు వరకూ ధరలు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయనే విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రజలు నిలదీస్తున్నారని తెలిపింది. ‘బాబూ.. మీ పాలనకు కోదండం.. ఇక ఇంటికి సాగనంపడమే మా కర్తవ్యం’ అన్నట్లుగా ప్రజలంతా ముక్తకంఠంతో కూటమికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు.


