డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నెల 21న నిర్వహించిన ఉపసంహరణలో ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది బరిలో 15 మంది అభ్యర్థులు మిగిలారు. వైఎస్సార్‌సీపీ నుంచి వరుదు కల్యాణి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవర నాగసునందాదేవి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, బహుజన సమాజ్ పార్టీ నుంచి కరణం కీర్తన గ్రేస్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని మేయర్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక దండి పార్టీ నుంచి బీ–ఫాం అందకపోవడంతో ఆమెను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా నిలిపివేయగా.. అధికారికంగా ఆదివారం జాబితాను ప్రకటించారు.
గుర్తులు ఇలా..
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తున్న వరుదు కల్యాణికి..ఫ్యాన్ గుర్తు
● బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కరణం కీర్తనగ్రేస్‌కు ఏనుగు
● భారత జాతీయ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న దేవర నాగ సునందాదేవికి హస్తం
● తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ముక్కా శ్రావణికి సైకిల్
● భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేస్తున్న నమ్మి భవానికి బ్యాటరీలైట్
స్వతంత్ర అభ్యర్థులు..
● ఫ్యాన్సీ నమ్మ అత్తిలికి..సీసా
● గొంప వెంకట పద్మావతికి సాసర్
● శైలజ తలుపులకి స్కూల్ బ్యాగ్
● ప్రియాంక దండికి ఎయిర్ కండీషనర్
● పకృతి దేవికి ఉంగరం
● బోర సంతోషికి కాలిఫ్లవర్
● లిఖిత లండాకి కొవ్వొత్తులు
● వాండ్రాసి శాంతికుమారికి పల్లకి
● వియ్యపు ఉమాకు ఫ్లూట్
● షేక్ దౌలతున్నీసా బీరువా..
నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు..
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వెంకటలక్ష్మీ జెర్రిపోతుల, ఉస్నారా పర్వీన్, తెలుగుదేశం పార్టీ నుంచి సేనాపతి వసంత, వైఎస్సార్ సీపీ నుంచి పేడాడ రమణకుమారి, వెంకట విజయకుమారి తిప్పల, స్వతంత్రులు పులిచింతల రాజేశ్వరి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
120 స్థానాలకు 570 మంది
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్పొరేటర్ ఎన్నికల బరిలో 570 మంది అభ్యర్థులు నిలిచారు. 120 వార్డులకు మొత్తం 1,623 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలన అనంతరం ఈ నెల 21న నిర్వహించిన ఉపసంహరణలో 1,053 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది బరిలో 570 మంది అభ్యర్థులు మిగిలారు. జోన్‌ల వారీగా చూస్తే తూర్పు జోన్ నుంచి 70 మంది, దక్షిణ జోన్ నుంచి 77 మంది, ఉత్తర జోన్ నుంచి 81 మంది, పశ్చిమ జోన్ నుంచి 73 మంది, గాజువాక జోన్ నుంచి అత్యధికంగా 140 మంది, అగనంపూడి జోన్ నుంచి 28 మంది, అనకాపల్లి జోన్ నుంచి 20 మంది, మధురవాడ జోన్ నుంచి 27 మంది, భీమిలి నుంచి 19 మంది, పెందుర్తి జోన్ నుంచి 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తుది బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.


