ఇంతటి వేదనా? | - | Sakshi
Sakshi News home page

ఇంతటి వేదనా?

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

ఏఎంసీలో రెండు నెలల్లో ముగ్గురు పీజీ వైద్య విద్యార్థుల బలవన్మరణం చదువుల ఒత్తిడా.. పనిభారమా.. వ్యవస్థాగత సమస్యలా? మానసిక ఆరోగ్యం, మెంటార్‌షిప్‌, డ్యూటీ గంటలపై మళ్లీ ప్రశ్నలు

ప్రాణాలు పోసే చేతులకు

ఇకనైనా వ్యవస్థ కళ్లు తెరవాలి

జరిగిన విషాదాన్ని తిరిగి మార్చడం సాధ్యం కాదు. అయితే ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం మాత్రం సాధ్యమే. ప్రతి మెడికల్‌ కాలేజీలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని విద్యలో అంతర్భాగంగా పరిగణించి, అందుబాటులో ఉండే కౌన్సెలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. పీజీ విద్యార్థుల పనిగంటలు, రొటేషనల్‌ డ్యూటీ విధానం, విశ్రాంతి సమయాల అమలును పర్యవేక్షించాలి. సమస్యలను ఎలాంటి భయం లేకుండా చెప్పుకునే నిష్పాక్షిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నప్పుడు వెంటనే సహాయం పొందేలా మెంటార్‌షిప్‌, కౌన్సెలింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.

మహారాణిపేట: వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోసే వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు. అలాంటి వైద్యులను తయారు చేసే విద్యా ప్రాంగణంలోనే యువ మెడికోలు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవడం వైద్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు యావత్‌ వైద్య రంగాన్ని, సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసలు మెడికల్‌ కాలేజీల్లో ఏం జరుగుతోంది? ఇది కేవలం విద్యార్థుల వ్యక్తిగత ఒత్తిడేనా? లేక మన విద్యా వ్యవస్థే వారిని బలితీసుకుంటోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రెండు నెలల్లో ముగ్గురు పీజీలు

డాక్టర్‌ను తయారు చేయాలన్న తల్లిదండ్రుల కల.. ఏళ్ల తరబడి సాగిన కఠోర శ్రమ.. వైద్య వృత్తిపై సమాజం పెట్టుకున్న నమ్మకం.. ఇవన్నీ ఒక్క విషాదంతో ఛిద్రమవుతున్నాయి. ఏఎంసీలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఘటనలు వైద్య విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. జూలై 24న పీజీ విద్యార్థి కాశీలమల్ల ఠాగూర్‌నాథ్‌ (31) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 24న జనరల్‌ మెడిసిన్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ పి.శైలజ రామనగర్‌లోని తన నివాసంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 28న ఈఎన్‌టీ మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని శ్రావణి (27) కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో ఏఎంసీ ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది.

అసలు సమస్య ఎక్కడ?

వరుస ఘటనల నేపథ్యంలో మెడికల్‌ కాలేజీల్లో పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై సమగ్ర పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిఘటనకు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని, అయితే ఒక్క కారణంతోనే ఇలాంటి విషాదాలను విశ్లేషించడం సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల విద్యా సంబంధిత ఒత్తిడి, పనిభారం, నిద్ర, విశ్రాంతి పరిస్థితులు, కుటుంబ అంశాలు, భవిష్యత్తుపై ఆందోళనలు, కాలేజీలో అందుతున్న మానసిక సహాయం వంటి అన్ని కోణాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

డ్యూటీ గంటలపై దృష్టి

పీజీ వైద్య విద్యార్థులు దీర్ఘకాలం విధుల్లో ఉండాల్సిన పరిస్థితులు వారి విశ్రాంతిపై ప్రభావం చూపుతున్నాయా? వరుసగా ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతోందా? డ్యూటీల కేటాయింపు, రొటేషన్ల అమలు, విశ్రాంతి సమయాలపై నిబంధనలు సమర్థంగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మెంటార్‌షిప్‌ ఎంత వరకు?

విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ప్రతి విభాగంలో సమర్థవంతమైన మెంటార్‌షిప్‌ వ్యవస్థ ఉందా? ఫిర్యాదులు, వ్యక్తిగత సమస్యలు, విద్యా ఒత్తిళ్లను చర్చించేందుకు వారికి నమ్మకమైన వేదిక అందుబాటులో ఉందా? సమస్యను చెప్పుకుంటే తమ విద్యా ప్రగతి లేదా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే భయం ఏమైనా ఉందా? అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే.

మహిళా మెడికోల పరిస్థితులపై పరిశీలన

మహిళా పీజీ విద్యార్థుల విషయంలో డ్యూటీల కేటాయింపు, రాత్రి విధులు, పని ప్రదేశంలో భద్రత, వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా సహాయక వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఆత్మహత్య పరిష్కారం కాదు

సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేయకూడదు. మానసిక సమస్యలు ఉంటే ఎవరైనా నన్ను నేరుగా కలవాలి. వారికి కౌన్సెలింగ్‌ ఇస్తాను. నా పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కాదు.

– డాక్టర్‌ కె.వి.రామిరెడ్డి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ మానసిక వైద్యశాల

ఒత్తిడికి గురికావద్దు

వైద్య విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికావద్దు. అధ్యాపకులు, ఇతరుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. చర్చలు, కౌన్సెలింగ్‌ ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. దీనిపై మంగళవారం వైద్య విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చాను.

– డాక్టర్‌ సంధ్యాదేవి,

ప్రిన్సిపాల్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement