ఆరిలోవ: జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఎక్కువ పాఠశాలల్లో అరకొరగా తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పలుచోట్ల టీడీపీ నాయకులు పెత్తనం చలాయించేందుకు ప్రయత్నించారు. వారికి అనుకూలంగా ఉన్న తల్లిదండ్రులనే కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులుగా చేర్చుకునేలా ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి చేశారు. అలాంటి చోట్ల మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు వారిని అడ్డుకోవడంతో కోరం లేదంటూ ప్రధానోపాధ్యాయులు ఎన్నికలు వాయిదా వేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెంలో టీడీపీ నాయకులు నేరుగా పాఠశాలలోకి చొరబడ్డారు. వారు చెప్పిన వారికే కమిటీలో స్థానం కల్పించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేశారు. అక్కడ వారిని మిగిలిన తల్లిదండ్రులు అడ్డుకోవడంతో కొంత గందరగోళం మధ్య ఎన్నిక ముగిసింది.
7 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా
జిల్లాలో 592 పాఠశాలల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్, సర్వశిక్ష అదనపు సంచాలకుడు జె.చంద్రశేఖరరావు తెలిపారు. వాటిలో ఏడు పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశామన్నారు. 318 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగగా, మిగిలిన పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించామన్నారు. వాయిదాపడిన పాఠశాలల్లో రాష్ట్ర పథక సంచాలకుడి తదుపరి ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
7 స్కూళ్లు మినహా ఎస్‌ఎంసీ ఎన్నికలు పూర్తి


