మహారాణిపేట: విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఇప్పటి నుంచే పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్‌కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఐఐ, ఏపీఈడీబీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఈ సదస్సుకు సంబంధించి భూమి చదును, రోడ్లు, పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, మరుగుదొడ్లు, అగ్నిమాపక, వైద్య, పోలీస్ భద్రత, తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి నుంచే నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సుమారు 500 మంది వరకు పాల్గొనే అవకాశం ఉన్నందున రవాణా, వసతి, ఆహారం తదితర ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ సమీక్షలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్‌చక్రవర్తి, కె.సంగీత్‌మాధుర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, జీఎం డీఐసీ ఆదిశేషు, ఏపీ ఈడీబీ ప్రతినిధి ప్రవీణ్, సీఐఐ ఏపీ హెడ్ సి.వి.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ వేదికగా
నవంబర్ 12, 13 తేదీల్లో సదస్సు


