అల్లిపురం: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 269 మంది పోలీసు సిబ్బందికి నగర సీపీ శంఖబ్రత బాగ్చి రివార్డులు అందజేశారు. మంగళవారం జరిగిన క్రైమ్ రివ్యూ సమావేశంలో గత నెలలో ప్రతిభ కనబరిచిన హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు పోలీసు సిబ్బందికి రివార్డు మంజూరు ఆర్డర్లను ఉన్నతాధికారుల సమక్షంలో ఆయన అందించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట, నిషేధిత పదార్థాల స్వాధీనం, చోరీ సొత్తు రికవరీ, నిందితుల అరెస్టు, సాంకేతిక వినియోగంతో నేరస్తుల గుర్తింపు, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.


