ఆరోగ్యశాఖకు నిర్లక్ష్యపు రోగం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖకు నిర్లక్ష్యపు రోగం

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

కమిటీలు కదులుతున్నాయ్‌..

ఫైళ్లు మూలుగుతున్నాయ్‌!

నెలల తరబడి నివేదికలు పెండింగ్‌..

చర్యల ఊసే లేదు

ఆరోగ్య శాఖలో ఆరోపణలపై

ప్రభుత్వ ఉదాసీనత

మహారాణిపేట: ఆరోగ్యశాఖలో అక్రమాలపై విచారణలంటే ‘తలాపున నీళ్లు.. గొంతులో ఎండికలు’అన్న చందంగా మారాయి! తప్పు చేసినవాళ్లకు రక్షణ కవచంలా, ఫిర్యాదుదారులకు నిరాశ మిగుల్చుతూ కమిటీల కాలయాపన తంతు నిత్యకృత్యమైంది. కేవలం విచారణల పేరుతో కాలం వెల్లదీస్తూ, నివేదికలను అటకెక్కించడంలో వైద్యశాఖ అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేయడానికేనన్న అనుమానాలు రేపుతున్నాయి.

ఏడాది దాటినా.. ఈఎన్‌టీ ఫైలు ‘చికిత్స’లోనే!

ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ పూర్తయి ఏడాది దాటినా నివేదికపై స్పష్టత లేదు. ఆరోపణల్లో వాస్తవమెంత? బాధ్యులెవరు? ఏం తేలింది? చర్యలు తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం కరవైంది. ఏడాది గడిచినా నివేదికపై నిర్ణయం తీసుకోకపోవడం వ్యవస్థ పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత కూడా ఫలితం లేకపోతే, కమిటీ ఏర్పాటుతో సాధించిన ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

హెడ్‌ నర్సుల పోస్టింగులు..

ఆరు నెలలైనా ‘నో యాక్షన్‌’!

హెడ్‌ నర్సుల ప్రమోషన్లు, పోస్టింగ్‌లలో అవకతవకలు జరిగాయంటూ కొందరు నర్సులు, నర్సింగ్‌ అసోసియేషన్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించింది. ఆరు నెలలు గడిచినా ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. పోస్టింగుల వ్యవహారంలో నిజానిజాలు తేల్చాల్సిన అధికారులు ఫైళ్లను తేల్చకపోతే, ఫిర్యాదీలకు న్యాయం ఎలా దక్కుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

72 గంటల డ్రామా.. రెండు నెలలుగా నిశ్శబ్దం!

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌, మందుల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపైనా విచారణ మొదలైంది. వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్య అదనపు సంచాలకుడు డాక్టర్‌ సత్యనారాయణమూర్తి చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించారు. 72 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చారు. కానీ నివేదిక ఇచ్చి రెండు నెలలు దాటినా చర్య మాత్రం ‘ఆక్సిజన్‌ లెవల్‌’లోనే! సరఫరాలో అవకతవకలు జరిగాయా? బాధ్యులెవరు? వ్యవస్థలో లోపాలేమిటి? వాటిని సరిదిద్దేందుకు ఏ చర్యలు తీసుకున్నారు? అన్నది ఇంకా స్పష్టంగా లేదు. విచారణకు 72 గంటలు సరిపోతే.. నిర్ణయానికి రెండు నెలలు ఎందుకు సరిపోవడం లేదన్నదే కీలక ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement