గుంతల గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

గుంతల గ్రహణం!

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

డాబాగార్డెన్స్‌ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారిలో ప్రమాదకరంగా గొయ్యి

ద్వారకానగర్‌ నుంచి రామాటాకీసు వెళ్లే రోడ్డు

విశాఖకు

డాబాగార్డెన్స్‌ ఎల్‌ఐసీ భవనం వద్ద..

సాక్షి, విశాఖపట్నం: అందమైన సాగర నగరి విశాఖ ఇప్పుడు అక్షరాలా ఓ ‘అడ్వెంచర్‌ పార్క్‌’ను తలపిస్తోంది. ఆహ్లాదంగా సాగిపోవాల్సిన పర్యటనలు.. నడుములు విరగ్గొట్టే రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లుగా మారిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, నగర రహదారుల రాత మాత్రం మారలేదు. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల వరకు ఎక్కడ చూసినా ప్రాణాలు తీసే మృత్యుబిలాలే స్వాగతం పలుకుతున్నాయి. ‘స్మార్ట్‌ సిటీ’ ముసుగులో అలరారాల్సిన విశాఖ, కనీస మౌలిక వసతులు లేక విలవిలలాడుతోంది.

వర్షం పడితే చావు బతుకుల ప్రయాణం

అభివృద్ధి పేరిట ఇటీవల హడావుడిగా వేసిన రోడ్ల అసలు స్వరూపం చిన్నపాటి వర్షానికే బయటపడింది. పనులన్నీ అధికార టీడీపీ కాంట్రాక్టర్ల చేతుల్లోకే వెళ్లడంతో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో వాడారంటే కాంట్రాక్టర్ల కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానికుల నుంచి పదే పదే ఫిర్యాదులొచ్చినా అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా.. వేసిన కొద్ది రోజులకే తారు కొట్టుకుపోయి కంకర తేలిపోయింది. ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప, రోడ్ల దుస్థితిని మార్చడానికి పనికిరాకుండా పోయింది.

లంకెలపాలెం కూడలిలో భారీ గుంత

పరవాడ సినిమాహాల్‌ జంక్షన్‌లో ధ్వంసమైన రోడ్డు

రోడ్ల మధ్యలో గుంతలా? గుంతల మధ్యలో రోడ్లా?

ఈ దారుణమైన పరిస్థితితో సామాన్య ప్రజలు, వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఏ గుంత ఏ క్షణాన ప్రాణాలు తీస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. కార్లు, ఆటోల బంపర్లు ఊడిపోవడం, గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లతో జనాల రక్తపోటు పెరిగిపోవడం నిత్యకృత్యమైంది. నాణ్యతను పాతాళానికి తొక్కిన కాంట్రాక్టర్లు ఒకవైపు అయితే.. కాంట్రాక్టర్లు చేసిన ఈ నాసిరకం పనులకు ‘అద్భుతం’ అని సర్టిఫికెట్లు ఇచ్చే క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల తీరు మరోవైపు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో లేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరిచి ఈ మృత్యుకూపాలను పూడ్చకపోతే, నగర రోడ్లు ప్రజల పాలిట శాపంగా మారడం ఖాయం. మొత్తంగా ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో విశాఖలో రోడ్ల మధ్యలో గుంతలు ఉన్నాయో.. లేక గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయో తెలియని అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement