కూటమి పాలనలో నగరానికి
మిగిల్చింది విధ్వంసమే..
జీవీఎంసీ ఎన్నికల్లో
బలమైన అభ్యర్థులు దించుతాం
శాసనమండలి విపక్షనేత బొత్స
సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్
కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో విశాఖ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజా సమస్యలను గాలికొదిలి భూదోపిడీ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. విశాఖ భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలు, వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో పార్టీ శ్రేణులను అన్ని స్థాయిల్లో సమన్వయం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గెలుపు సామర్థ్యం ఉన్న అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలబెడతామని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీలో బలమైన నాయకులు ముందుకు వచ్చారని, త్వరలోనే తుది పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
కూటమి పాలనలో విధ్వంసమే.. : కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో నగరానికి చేసిందేమీ లేదని బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు విమర్శించారు. నగరంలోని రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి నెలకొందని, చిన్నపాటి వర్షానికే నగరం నీట మునిగిపోతోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సాధారణ బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠంపై కూర్చోబెట్టి గౌరవించామని గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి, కుట్రలతో ఆ యాదవ మహిళను పదవి నుంచి దించేశారని మండిపడ్డారు.
భూబకాసురుల పాలనగా మారింది..
విశాఖలో టీడీపీ ఎంపీకి చెందిన గీతం కళాశాల పరిధిలో కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా, కౌన్సిల్‌లో దీనిపై నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దౌర్జన్యం చేసి గాయపరిచారని కన్నబాబు ఆరోపించారు. ఎకరా భూమిని 99 పైసలకే కట్టబెడుతూ నగర సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తశారు. గతంలో రుషికొండపై ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే విమర్శలు చేసిన నాయకులు.. ఇప్పుడు పంచదార్ల కొండ నుంచి సింహాచలం కొండల వరకు అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తాగునీటి సమస్య ఎదురైందని బొత్స సత్యనారాయణ, కన్నబాబు పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, బొత్స అనూష, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, చింతకాయల సన్యాసి పాత్రుడు, సతీష్ వర్మ, జహీర్ అహ్మద్ పాల్గొన్నారు.
డివిజన్ల విభజనపై కోర్టుకు వెళ్తాం
జీవీఎంసీ వార్డుల పునర్విభజనలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బొత్స, కన్నబాబు ఆరోపించారు. ప్రభుత్వ జీవో ప్రకారం డివిజన్ల మధ్య ఓటర్ల సంఖ్యలో 10 శాతం మాత్రమే వ్యత్యాసం ఉండాలని, కొన్ని డివిజన్లలో 30 వేల మంది, మరికొన్ని డివిజన్లలో 20 వేలు, ఇంకొన్ని చోట్ల 15 వేల మంది ఓటర్లు ఉండేలా విభజన చేశార న్నారు. వైఎస్సార్‌సీపీకి బలంగా ఉన్న వార్డులను చీలుస్తున్నారని ఆరోపిస్తూ, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


