విశాఖ రైల్వేస్టేషన్‌కు 130 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వేస్టేషన్‌కు 130 ఏళ్లు

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

తాటిచెట్లపాలెం: చారిత్రక విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ 130వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వందేళ్లు పైబడిన చారిత్రక రైల్వేస్టేషన్లలో నిర్వహిస్తున్న ‘స్టేషన్‌ మహోత్సవ్‌’లో భాగంగా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1896లో కేవలం రెండు ప్లాట్‌ఫారాలు, రోజుకు సుమారు 200 మంది ప్రయాణికులతో నిరాడంబరంగా ప్రారంభమైన విశాఖ రైల్వే స్టేషన్‌, ప్రస్తుతం 8 ప్లాట్‌ఫారాల ద్వారా రోజూ 65 వేల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తూ అత్యంత రద్దీగల రవాణా కేంద్రంగా ఎదిగిందన్నారు. అత్యాధునిక మొబిలిటీ సెంటర్‌గా దీనిని తీర్చిదిద్దుతూ, ప్లాట్‌ఫారాల సంఖ్యను 14కు పెంచేందుకు ప్రపంచ స్థాయి పునరాభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 130 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌ వాల్తేర్‌ నుంచి విశాఖపట్నంగా మారిన క్రమంతో పాటు, స్టేషన్‌ చరిత్ర, గత జ్ఞాపకాలను ప్రతిబింబించే కాఫీ టేబుల్‌ బుక్‌, మొమెంటోలను జీఎం సందీప్‌ మాధుర్‌, డీఆర్‌ఎంతో కలిసి ఆవిష్కరించారు. స్టేషన్‌లోని మొదటి నంబర్‌ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ చరిత్రను ప్రతిబింబించే ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను జీఎం, డీఆర్‌ఎం సందర్శించారు. అనంతరం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌), రైల్వేలోని వివిధ విభాగాల సిబ్బందితో మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు. విశాఖపట్నం డివిజన్‌ డివిజనల్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రత్యేక గీతాలు, లఘునాటికల ద్వారా రైల్వే చరిత్రను, విశాఖ స్టేషన్‌ ప్రస్థానాన్ని ఆవిష్కరించారు. 130 ఏళ్ల చరిత్రకు ప్రతీకగా నిర్వహించిన ఈ స్టేషన్‌ మహోత్సవ్‌.. విశాఖ రైల్వేస్టేషన్‌ గత వైభవాన్ని, రైల్వేతో నగరానికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని చాటిచెప్పింది. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు ఈ.శాంతారాం(ఇన్‌ఫ్రా), కె.రామారావు(ఆపరేషన్స్‌), బ్రాంచ్‌ అధికారులు, ఇతర రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా స్టేషన్‌ మహోత్సవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement