పెదగంట్యాడ: దేశంలోనే అతి పెద్ద పాప్ కల్చర్ వేడుక కామిక్ కాన్ ఇండియా 2026–27 సీజన్‌ను అక్టోబర్ 10, 11 తేదీల్లో ఏఎంటీజెడ్‌లోని కలాం కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామిక్స్, యానిమే, గేమింగ్, సంగీతం, స్టాండప్ కామెడీలతో కూడిన వేడుకలకు ఏఏంటీజెడ్ సిద్ధమైంది. ఇందులో రోల్ రైడా, అర్బన్ టేల్స్, బుల్ సై ప్రెస్ వంటి అంతర్జాతీయ స్థాయి విన్యాసాలతో పాటు కామిక్స్, గ్రాఫిక్ నవలలు, డిజిటల్ ఆర్ట్, లైవ్ ఆర్ట్, విజువల్ స్టోరీ టెల్లింగ్ ప్రదర్శించనున్నారు. తెలుగు హిప్‌హాప్ ఆర్టిస్ట్ రోల్ రైడా, విశాఖకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ రాపర్ సి–షోర్, లవ్ అరుణ్, ది 9టీన్ బృందం తమ సంగీతంతో సందడి చేయనున్నారు. గేమర్లు, పుస్తక ప్రియులు, కంటెంట్ క్రియేటర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఇది చక్కని అవకాశంగా నిలవనుంది.


