22ఏ భూముల పేరుతో దోచుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

22ఏ భూముల పేరుతో దోచుకుంటున్నారు

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

ప్రభుత్వం పరిష్కరించేవరకూ

బాధితుల తరఫున పోరాడతాం

మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు,

సెంటర్‌ ఫర్‌ లిబర్టీ అధ్యక్షుడు

నల్లమోతు చక్రవర్తి

మహారాణిపేట: ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యతే కానీ, ప్రైవేట్‌ ఆస్తులను 22ఏ పేరుతో నిరోధించడం ప్రభుత్వ హక్కు కాదని మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో వినతిపత్రం సమర్పించిన అనంతరం, సెంటర్‌ ఫర్‌ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 22ఏ సెక్షన్‌ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన నిబంధన అని అన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చి, యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 300–ఏ కల్పించిన ఆస్తి హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆస్తి యజమానులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూములను 22ఏ జాబితాలో చేర్చి, అనంతరం కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిప్పడం సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా బాధితులను తిప్పుకోవడం ఆందోళనకరమన్నారు. దీనికి సంబంధించిన పిటిషన్లపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇటీవల ఈ జాబితాలో చేర్చిన 10 లక్షల ఎకరాలను జీవో 588 ద్వారా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇదే విధంగా అర్హత ఉన్న ప్రైవేట్‌ భూములను కూడా సమగ్రంగా పరిశీలించి ఈ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో పలు భూముల రికార్డుల్లో భూకబ్జాదారుల పేర్లు నమోదైన ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. గతంలో పనిచేసిన కొంతమంది కలెక్టర్లు కూడా ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు. ఈ అంశంపై విశాఖ జిల్లాలో 88 పిటిషన్లను కలెక్టర్‌కు సమర్పించామని, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో వేచి చూస్తామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి కలెక్టర్‌ను కలుస్తామన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement