50 ఏళ్ల తర్వాత.. అదే క్లాస్‌రూమ్‌.. అదే ప్రొఫెసర్‌ | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల తర్వాత.. అదే క్లాస్‌రూమ్‌.. అదే ప్రొఫెసర్‌

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● 1976–78 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం ● గురువుతో మళ్లీ కలిసిన అపురూప క్షణం

విశాఖ విద్య: ఏయూలోని ఆర్ట్స్‌ కళాశాలలోని 15వ నంబరు గది.. 1976లో ఎంఏ సోషల్‌ వర్క్‌ తొలి సెమిస్టర్‌ సెమిస్టర్‌ తరగతులు జరిగిన అదే గదిలోకి 50 సంవత్సరాల తర్వాత తిరిగి అడుగుపెట్టారు పూర్వ విద్యార్థులు. అప్పట్లో ఏ స్థానాల్లో కూర్చున్నారో.. ఇప్పుడూ అక్కడే కూర్చున్నారు. 1976లో వారికి బోధించిన ప్రొఫెసర్‌ కొర్లపాటి దశరథ రామయ్య అదే గదిలో వారిని కలిసి, అప్పట్లో బోధించిన ‘ప్రవర్తనా ప్రగతిశీలత’ పాఠాన్ని మరోసారి వారితో పంచుకున్నారు. అదే గురువు.. అదే తరగతి గది.. ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడడంతో పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అపురూప కలయిక వారి స్వర్ణోత్సవ వేడుకలకు మరపురాని మధురానుభూతిగా మిగిలింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషల్‌ వర్క్‌ 1976–78 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఐదు దశాబ్దాల తర్వాత ఒకచోట చేరిన పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, అప్పటి అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. మాజీ ఐఏఎస్‌, మాజీ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్య, విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతల ప్రాధాన్యాన్ని వివరించారు. తమ జీవితాలను తీర్చిదిద్దిన గురువులను స్మరించుకున్న పూర్వ విద్యార్థులు.. ఐదు దశాబ్దాల ప్రస్థానంలో సాధించిన విజయాలను పరస్పరం పంచుకుని ఆనందించారు. ఈ సమ్మేళనానికి డా. ఇవటూరి భానుమతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏయూలో జువాలజీలో ఎమ్మెస్సీ చేసిన ఆమె అనంతరం ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో ఎంఏ సోషల్‌ వర్క్‌ అభ్యసించారు. ఏయూలో సోషల్‌ వర్క్‌లో మొట్టమొదటి పీహెచ్‌డీ పొందిన పరిశోధకురాలిగా గుర్తింపు పొందారు. సమ్మేళనం విజయవంతం కావడంలో ప్రొ. ఎస్‌.వి. సుధాకర్‌ చేసిన కృషిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement