మహారాణిపేట: విశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గళమెత్తి, అదే ఉద్యమంలో అసువులు బాసిన తోట సుధాకర్ ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని విశాఖలో ఆవిష్కరించడం ప్రత్యేకమని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం విశాఖ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని రెవెన్యూ భవన్ వద్ద సుధాకర్ ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుధాకర్ ప్రసాద్ 25వ వర్ధంతిని విశాఖలో నిర్వహించడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వివాహమైన మరుసటి రోజే తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న నిస్వార్థ నాయకుడని గుర్తుచేశారు. సుధాకర్ ప్రసాద్ భార్య కామాక్షి మాట్లాడుతూ సామాన్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైనప్పుడు తన భర్త ఎంతో సంతోషించేవారని తెలిపారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎ.త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, సహాధ్యక్షుడు ఎ.శ్రీరామమూర్తి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ రాష్ట్ర కార్యదర్శి దాట్ల రాజేంద్రవర్మ, జిల్లా కార్యదర్శి శ్యాంప్రసాద్, కోశాధికారి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి వినోద్‌కుమార్, విశాఖ జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు పి.వి.రమణ, టి.గోవింద్, నగర శాఖ అధ్యక్షుడు వీవీవీ సత్యనారాయణ, కార్యదర్శి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


