బీచ్‌రోడ్డు: విశాఖను ఐటీ, మెడికల్, బీచ్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ, జీవీఎంసీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఆదివారం ‘వైజాగ్ వేవ్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అరకు, పాడేరు ఏజెన్సీ అందాల నుంచి అనకాపల్లి బౌద్ధ క్షేత్రాల వరకు జిల్లాలో పర్యాటకంగా అపార అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ తిరుమల మినహా రాష్ట్రంలో అత్యధిక పర్యాటక కార్యకలాపాలు విశాఖలోనే జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల్లో 85 శాతం మంది విశాఖను సందర్శిస్తున్నారని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ విశాఖ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో 40 నుంచి 50 దేశాలను సందర్శించిన ముగ్గురు యాత్రికులను అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక కళాకారుల స్కిట్, లైవ్ బ్యాండ్ సంగీత విభావరి, ఓపెన్ మైక్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు.


