అల్లిపురం: నగరంలోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ గంగ (34) పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆరిలోవ అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆ స్థితికి చేరుకోడానికి గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం గంగ తలకు టవల్ చుట్టి, మెడకు పైజామా లాడా బిగించి అపస్మారక స్థితిలో ఉండగా.. ఇంటికి వెళ్లిన సహోద్యోగి రంజిత్ గమనించారు. వెంటనే మరో ఇద్దరి సహాయంతో 112కు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి మార్చారు. ఇదిలా ఉంటే.. ఆమైపె దాడికి పాల్పడింది ఎవరు? ఎందుకు చేశారు? అనే కోణాల్లో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగ నివాసం సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. స్నేహితులు, పరిచయస్తుల్లో ఎవరైనా దాడికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఆమె సోదరి క్యాంపు నుంచి శుక్రవారం నగరానికి రానున్నారు. ఆమె ద్వారా ఏదైనా సమాచారం లభిస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


