సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
బార్లలోనే కాదు.. బయటా బీరు, మద్యం దందా జోరుగా సాగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున ప్రైవేటు వ్యక్తులను పెట్టి అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నా.. అసలు బార్ల యాజమాన్యాలపై చర్యలు మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్, ఎల్లమ్మతోట, జగదాంబ, సోలిపేట ప్రాంతాల్లోని బార్లతో పాటు వైన్ షాపుల్లోనూ, నగర శివార్లలోనూ ఇదే తరహా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓల్డ్ టౌన్ ప్రాంతంలో స్థానిక పోలీసులు వరుసగా రెండు, మూడు రోజుల పాటు దాడులు చేసి, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఈ దాడులు జరిగాయి. అనంతరం, సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, వైన్‌షాపుల యజమానులు, సిబ్బందితో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు పట్టుకున్నామో లెక్కలతో సహా వివరిస్తూ.. బార్లలో పనిచేసే సిబ్బందితో అధిక ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, చివరకు ఎంత మద్యం పట్టుబడింది అనే విషయంలో పోలీసు లు విడుదల చేసిన ప్రకటనకు, నమోదు చేసిన కేసులకు మధ్య తీవ్ర తేడాలు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడం వల్లే ఈ వివరాలు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. బార్ల యాజమాన్యాలను రక్షించేందుకు, అమ్మకాలు బయట జరిగాయనే నెపంతో కేవలం సిబ్బందిపైనే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
‘ఏటీఎం’ బార్లు..!
మద్యం బాటిళ్ల లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు
పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 115 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విక్రయిస్తున్న సిబ్బందిపైనే కేసులు పెట్టారు తప్ప, ఎక్కడా బార్ల యాజమాన్యాల జోలికి వెళ్లలేదు. ఇందులో ఒక బార్ యజమాని జనసేన ఎమ్మెల్యేకు, మరొకరు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితులు కావడంతోనే లెక్కలు మారాయని సమాచారం. దాడుల సమయంలో ఒక బారు బయట 600 బాటిళ్లు, మరో వైన్ షాపు వద్ద 150 బాటిళ్లు, ఇంకో బార్ వద్ద ఏకంగా 16 కేసుల (800 బాటిళ్లు) మద్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇవే లెక్కలను దాడులు జరిపిన తర్వాత పోలీసు స్టేషన్లో బార్ల యాజమాన్యాలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వెల్లడించినట్టు సమాచారం. కానీ, తుది కేసు నమోదు సమయానికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అంత పెద్ద మొత్తంలో మద్యం లభ్యమైతే, అది కచ్చితంగా సమీపంలోని బార్లు, వైన్ షాపుల నుంచే సరఫరా అయి ఉంటుంది. కానీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపకుండా, వారు ఎమ్‌ఆర్‌పీకి కొనుక్కొని అధిక ధరలకు అమ్ముకుంటున్నారంటూ విక్రేతలపైనే కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల బార్ల నుంచే ఈ మద్యం సరఫరా అవుతున్నప్పటికీ, అసలు యజమానులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. అయితే తమకు దొరికిన బాటిళ్ల ప్రకారమే పక్కాగా కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.
మద్యం ప్రియుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బార్లు, వైన్‌షాపులు అధిక ధరలకు ఎప్పుడంటే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. తెల్లవారుజామునే వేట, ఇతర పనులకు బయలుదేరే కొందరు.. మద్యం సేవించకుండా ఉండలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఈ విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నాలుగైదు బార్లు, వైన్‌షాపులను మద్యం ప్రియులు ‘ఏటీఎం’ (ఎనీటైం మద్యం)లుగా పిలుచుకుంటున్నారనే ప్రచారం ఉంది. మరికొందరు వీటిని ‘స్విగ్గీ, జొమాటో బార్లు’ అని కూడా అంటున్నట్టు తెలుస్తోంది. నగరంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉండటంతోపాటు.. పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి వాటిని పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న అసలు వ్యక్తులను గుర్తించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన దాడు ల పరిధిలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా.. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ‘ఎనీటైం మద్యం’ విక్రయాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.


