బీచ్‌రోడ్డు: రోగుల ప్రాణాలను కాపాడేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నాం’.. మా జీవితాలకు భద్రత కల్పించండి’ అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వెన్నెముకగా నిలుస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ మెడికల్ జేఏసీ, విశాఖ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సెంట్రల్ పార్క్ ధర్నా చౌక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు చేతిలో కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం సేవలందిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చే జీతంలో 40 శాతం మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇస్తున్నారని.. ఒకే పని, ఒకే విధులు చేస్తున్నా వివక్ష చూపడం తగదని, వెంటనే 100 శాతం జీతం అమలు చేయాలని కోరారు. కరోనా సమయంలో సేవలు అందించిన ఎందరో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.50 లక్షల ప్రమాద, జీవిత బీమా సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఆశా మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ‘డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, వివిధ ఆసుపత్రుల వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆవేదన కొవ్వొత్తులతో భారీ ర్యాలీ


