గణేష్‌ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

అల్లిపురం: ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న గణేష్‌ చతుర్థి ఉత్సవాలకు నిర్వాహకులు ముందస్తుగా సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ పర్మిషన్‌ సిస్టమ్‌ ద్వారా అనుమతి పొందాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. శనివారం పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరులతో ఆయన మాట్లాడు తూ మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఉత్సవాల వ్యవధి, కార్యక్రమాలు, అంచనా జనసమూహం, విద్యుత్‌, అగ్నిమాపక భద్రత, సౌండ్‌ సిస్టమ్‌, నిమజ్జనం తేదీ, సమయం, ఊరేగింపు మార్గం తదితర వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తులో నమోదు చేయాలన్నారు. అనుమతి మంజూరైన తర్వాత మండపానికి క్యూఆర్‌ కోడ్‌ జారీ చేస్తామని, దానిని స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. అనుమతి లేని ప్రదేశాలు, ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లపై మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, పోలీస్‌, ఫైర్‌ స్టేషన్లకు వెళ్లే మార్గాలకు ఆటంకం కలిగించరాదని, అత్యవసర వాహనాలకు మార్గం ఖాళీగా ఉంచాలని సూచించారు.

● మండపాల్లో విద్యుత్‌ వైరింగ్‌ సురక్షితంగా ఉండేలా చూడాలని, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్లు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి మండే పదార్థాలను నిల్వ చేయరాదన్నారు. అవసరమైన చోట సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, రాత్రివేళ మండపాల వద్ద బాధ్యతగల వ్యక్తులు ఉండేలా చూడాలని సూచించారు. సౌండ్‌ సిస్టమ్‌కు అనుమతులు తీసుకుని నిర్దేశిత శబ్ద పరిమితులు, సమయాల్లోనే వినియోగించాలని, డీజే వినియోగంపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

● గణేష్‌ ఉత్సవాల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేయరాదని, మండపాల వద్ద జూదం, మద్యం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావివ్వరాదన్నారు. పర్యావరణహిత విగ్రహాలు, సహజమైన రంగులను వినియోగించాలని సూచించారు. నిమజ్జనం ఊరేగింపు కోసం మార్గం, సమయం, పాల్గొనే భక్తులు, వాహనాల వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలని తెలిపారు. ఊరేగింపుల్లో డీజే, మద్యం, మత్తుపదార్థాలు, బాణసంచాకు అనుమతి లేదన్నారు.

● అనుమతి నిబంధనలు ఉల్లంఘించినా, నిర్వాహకులు లేదా కమిటీ సభ్యుల నిర్లక్ష్యంతో అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు పోలీసు, సంబంధిత శాఖలకు సహకరించాలని కోరారు.

పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి

పీవీసీ స్టేటస్‌ ఇక ఆన్‌లైన్‌లో..

పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ (పీవీసీ) అప్లికేషన్‌ స్టేటస్‌ను సులభంగా తెలుసుకునేందుకు సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ మేరకు శనివారం పీవీసీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నగరంలోని స్టేట్‌, సెంట్రల్‌ డిఫెన్స్‌ విభాగాల్లో పని చేసే ప్రైవేట్‌ వ్యక్తులకు ఈ పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. అలా రోజుకి సుమారు 50 నుంచి 60 అప్లికేషన్లు వస్తుంటాయన్నారు. దరఖాస్తుదారులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే తక్షణమే పీవీసీ స్టేటస్‌ తెలుస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement