విశాఖ విద్య: ఉపాధ్యాయుల సేవలకు కొలమానం లేదని, వారి సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. తన జీవితంలో ఎంతోమంది ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలిచారని, వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు నేర్పిన విలువలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 80 మందికి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి విజయ భారతి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సేవలందించారని, ఆమె రెండుసార్లు అవార్డులు అందుకున్న సమయంలో తాను పక్కనే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి తప్పకుండా ఉంటుందన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టమైన విద్యార్థిగా ఉండాలని ఎప్పుడూ తపించేవాడినని చెప్పారు. తాను ఐఏఎస్ అధికారి కాకపోయి ఉంటే తప్పకుండా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకునేవాడినని వెల్లడించారు. కేవలం కరిక్యులమ్‌ను పూర్తి చేయడానికే పరిమితం కాకుండా ఉత్తమ బోధనా విధానాలను అవలంబిస్తే ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికే ప్రాధాన్యంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను అవార్డులతో కొనలేమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ సతీష్, డీఈవో ప్రేమకుమార్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ పురస్కారాలను అందజేశారు.


