తరలించిన విద్యార్థులను పాఠశాలలోనే కొనసాగిస్తామని హామీ దరఖాస్తు చేస్తే కొత్త అడ్మిషన్లకు అవకాశం పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు దాటుకుని ఉద్యమం ఒక్క ఏడాదికే అనుమతిపై తల్లిదండ్రుల్లో అనుమానాలు శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాల డిమాండ్
మారికవలస గిరిజన గురుకులంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపుపై వైఎస్సార్‌సీపీ, గిరిజన, ప్రజా సంఘాల పోరాటం ఫలించింది. విద్యా సంవత్సరం మధ్యలో 480 మంది గిరిజన విద్యార్థులను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో గత నెల 26న అర్ధరాత్రి పోలీసు బందోబస్తుతో బలవంతంగా తరలించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం రోజులుగా సాగిన ఆందోళనలు మంగళవారం మరింత ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలసలోనే విద్యార్థుల చదువు కొనసాగించేందుకు అంగీకరించింది.
రాత్రింబవళ్లు ఉద్యమం
విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, గిరిజన, ప్రజా సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనలు కొనసాగించాయి. రాత్రివేళల్లోనూ రోడ్లపైనే నిద్రిస్తూ నిరసన తెలిపారు. తరలించిన విద్యార్థులను తిరిగి మారికవలసకు తీసుకొచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆందోళన తీవ్రత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.
అడ్డుకున్నా.. ఆగని ఆందోళనలు
ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు దిగారు. కీలక నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతోపాటు మారికవలస వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పాఠశాల వద్ద నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించారు.
ఒక్క ఏడాదికేనా?
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మారికవలసలో చదువుకు అనుమతి ఈ ఒక్క విద్యా సంవత్సరానికే పరిమితమని అధికారులు చెప్పడంతో ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది మళ్లీ తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలిస్తారా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వ నిర్ణయంపై పూర్తిస్థాయి నమ్మకం కలగడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతానికి పిల్లల చదువు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం వచ్చేవరకు పోరాటం
గురుకులాన్ని మారికవలసలోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం రాతపూర్వకంగా స్పష్టం చేయాలని, 69వ నంబర్ జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తాత్కాలిక సర్దుబాట్లతో సమస్యకు పరిష్కారం లభించదని గిరిజన, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. గురుకులాన్ని శాశ్వతంగా ఇక్కడే కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
వైఎస్సార్‌సీపీ ఆందోళనకు తెలుగు శక్తి మద్దతు
పీఎం పాలెం: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల మూసివేతకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనకు తెలుగు శక్తి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంస్థ అధినేత బీవీ రామ్ తెలిపారు. మంగళవారం తనను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు.
ఆనందపురం పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు సతీష్ వర్మ, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి పనివేలి ఈశ్వరి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కృష్ణ, జి.వి.రవిరాజు, డీఎల్‌వో కేంద్ర కమిటీ కన్వీనర్ పెలమాల రంజిత్‌కుమార్, డీఎస్‌వో నాయకుడు కె.కొత్తయ్య, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి అప్పలనాయుడు, నాయకులు ఎం.నరేష్, ఎస్.తులసి, వి.ఉదయలను పోలీసులు అరెస్టు చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మారికవలసలో ‘మాస్’ డ్రామా
పోలీసుల కళ్లుగప్పి కేకే రాజు ఎంట్రీ
వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకున్న తీరు నగరంలో తీవ్ర ఉత్కంఠ రేపింది. మారికవలస గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా పోలీసులు ఆయన ఇంటిని ముట్టడించారు. అయితే, కేకే రాజు తన ఇంటి వెనుక మార్గం గుండా తప్పించుకుని, మహిళా కార్యకర్తలతో కలిసి సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపిన ఆయనను.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ పోలీసులతో పాటు ఏజెన్సీ నుంచి సివిల్ డ్రెస్‌లో వచ్చిన వంద మందికి పైగా సిబ్బంది కేకే రాజు మెడపట్టుకుని బలవంతంగా బస్సు ఎక్కించి భీమిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దరఖాస్తు చేస్తే.. ఇక్కడే అడ్మిషన్
మంగళవారం వైఎస్సార్‌సీపీ, గిరిజన, ప్రజాసంఘాల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో సాయంత్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, గురుకులాల ఉన్నతాధికారులు పాఠశాల వద్దకు వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి.. తమ పిల్లలను మారికవలసలోనే చదివించాలని కోరుతూ లిఖితపూర్వకంగా దరఖాస్తు చేస్తే అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే తరలించిన విద్యార్థులను కూడా ఇక్కడే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బుధవారం అనకాపల్లి జిల్లాలో పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అనంతరం తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.


