డిమాండ్ల సాధనకు అన్ని
విభాగాల ఉద్యోగుల నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు
హాజరైన ఉద్యోగులు
మహారాణిపేట: ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, డిమాండ్ల సాధన కోసం ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు శ్రీకారం చూట్టారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీజేఏసీ అమరావతి భాగస్వామ్య డిపార్ట్‌మెంట్ల సంఘ సభ్యులు(ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు) నల్ల బ్యాడ్జీలు ధరించి తమ అవేదనను ప్రభుత్వానికి తెలిపారు. భీమిలి ఆర్డీవో కార్యాలయం, పెందుర్తి, గాజువాక తహసీల్దార్ కార్యాలయాలు, మధురవాడ జోనల్ కార్యాలయం, జిల్లా పరిషత్ వద్ద అకౌంట్స్ విభాగం, ఆడిట్ విభాగం, డీఎస్‌వో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ విభాగంలో నాల్గవ తరగతి ఉద్యోగుల నుంచి తహసీల్దార్లు వరకు, జీవీఎంసీ అన్ని విభాగాల ఉద్యోగులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్(ఆర్‌టీసీ), ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, లేబర్ డిపార్ట్‌మెంట్, కోఆపరేటివ్, మున్సిపల్ టీచర్స్, ప్రభుత్వ డ్రైవర్లు, వెటర్నరీ డాక్టర్లు, వీఆర్వోలు, రికార్డ్ అసిస్టెంట్లు, సివిల్ సప్లైస్ ఉద్యోగులు, డిఫరెంట్లీ ఏబుల్ ఎంప్లాయిస్, పార్ట్ టైం టీచర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరైయ్యారు. ఉద్యోగుల మొబైల్లో.. ‘సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి’అనే పిక్‌ని వాట్సప్ డీపీలుగా పెట్టుకున్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సహ చైర్మన్ ఎస్‌ఏ త్రినాథరావు, మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అప్పలరాజు, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి శ్యాంప్రసాద్, సీటీ అధ్యక్షుడు వీవీవీఆర్‌వీ సత్యనారాయణ, కార్యదర్శి రవిశంకర్, జేఏసీ అమరావతి విశాఖ జిల్లా ఉమెన్ వింగ్ చైర్‌పర్సన్ శైలజ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.


