వందేళ్ల పండగలో ‘దొంగ బిల్లుల’ దందా? తిండీ తిప్పలు ఉద్యోగులవే.. బహుమతులు దాతలవే! ఖర్చు మాత్రం వర్సిటీ ఖాతాలో.. బిల్లులపై విచారణకు ఉద్యోగుల డిమాండ్
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలన విభాగంలో పాతుకుపోయిన అవినీతి తిమింగలాలు వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఏళ్ల తరబడి చక్రం తిప్పుతున్న కొందరు ఉద్యోగులు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఏయూ ఖజానాను కొల్లగొడుతున్నారు. తాజాగా శతాబ్ది వేడుకల ముసుగులో బోధన, బోధనేతర సిబ్బంది కోసం నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాల్లో సాగిన దొంగ బిల్లుల వ్యవహారం విశ్వవిద్యాలయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఖర్చే లేని చోట అడ్డగోలుగా రూ.4 లక్షల నకిలీ బిల్లులు సృష్టించి జేబులు నింపుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన వైనం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సామగ్రి నుంచి భోజనం దాకా
అంతా ఉచితమే!
క్రీడల్లో పాల్గొన్న ఉద్యోగులకు కనీసం టీ–షర్టులు, ట్రాక్‌సూట్లు కూడా కొనివ్వకుండా సొంతంగా బ్యాట్లు, బాల్స్ తెచ్చుకోవాలని చేతులెత్తేశారు. రెండు రోజుల పాటు మైదానంలో ఆడిన సిబ్బందికి మధ్యాహ్నం భోజనం, పెరుగన్నం, చివరికి గొంతు తడుపుకునే మంచినీటిని సైతం కొందరు ఉద్యోగులే సొంత జేబుల్లో నుంచి డబ్బులు తీసి స్పాన్సర్ చేశారు. ఆటల్లో విజేతలకు ఇచ్చిన కప్పులు, మెడల్స్ కూడా జాలాది శ్రీనివాస్ అనే దాత ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసినవే. ఉద్యోగ ఉత్సవంలో అలరించిన డ్యాన్సులు, కోలాటం, ఆర్కెస్ట్రాలకు అయిన ఖర్చులనూ ఉద్యోగులే భరించారు. ఈ దాతలకు సాక్షాత్తూ వర్సిటీ వేదికపైనే సన్మానాలు చేసి, వారి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఉంచారు.
రూ.4 లక్షల దొంగ లెక్కలేంటి?
అసలు పైసా ఖర్చు లేకుండా మొత్తం వ్యవహారం ఉద్యోగుల విరాళాలు, దాతల ఔదార్యంతోనే పూర్తయినప్పుడు.. వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.2 లక్షల అడ్వాన్స్ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా, కమిటీలోని ఇతర సభ్యులను పక్కనపెట్టి, మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షల బిల్లులను డిప్యూటీ రిజిస్ట్రార్ (అడ్మిన్) ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాస్ చేయించేందుకు ఓ కీలక ఉద్యోగి తీవ్రంగా పైరవీలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
వీసీ నిగ్గు తేల్చాలి..
బాధ్యులపై వేటు వేయాలి!
ఖజానాకు గండికొట్టేలా సాగుతున్న ఈ నకిలీ బిల్లుల బాగోతంపై వైస్ ఛాన్సలర్ తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని ఉద్యోగ వర్గాలు గళమెత్తుతున్నాయి. దాతల వివరాలు, ఈవెంట్ వాస్తవ ఖర్చులు, అడ్వాన్స్ సొమ్ము లెక్కలను బయటకు తీసి పూర్తి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అవినీతి బండారం మొత్తం బట్టబయలవుతుందని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ప్రతిష్టకు మచ్చతెస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు యత్నించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


