ప్రాణవాయువుకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

ప్రాణవాయువుకు గ్రహణం

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో కేజీహెచ్‌లో

6 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు

అలంకారప్రాయంగా మారిన

4 యూనిట్లు.. రెండింటిపైనే ఆధారం

రూ.60 లక్షలతో బాగుచేసే

అవకాశం ఉన్నా పట్టని కూటమి సర్కార్‌

బయట నుంచి ఆక్సిజన్‌ కొనుగోళ్లకే

అధికారుల ఆసక్తి?

కేజీహెచ్‌లో అత్యవసర వేళల్లో అందని ఆక్సిజన్‌

మహారాణిపేట: పేదల పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో ప్రాణవాయువుకే కష్టాలు వచ్చాయి. కోవిడ్‌ విపత్తు సమయంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆస్పత్రి అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసేలా కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పించింది. అప్పట్లో ఎంతో ఉపయోగపడిన ఆ ప్లాంట్లలో ఇప్పుడు నాలుగు పనిచేయడం లేదు. రెండింటిపైనే మొత్తం కేజీహెచ్‌ భారం పడుతోంది. 1,187 పడకల ఈ ఆస్పత్రికి నిత్యం భారీగా రోగులు వస్తుంటారు. రోజుకు 1,500 నుంచి 2,200 వరకు ఓపీకి, 300 నుంచి 600 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 26 విభాగాల్లో ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగులకు ప్రస్తుతం పనిచేస్తున్న రెండు ప్లాంట్లే ఆధారం. అత్యవసర వేళల్లో డిమాండ్‌ పెరిగితే బయట నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆరు ఏర్పాటుచేస్తే.. నాలుగు మూత!

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆరు ప్లాంట్లు కోవిడ్‌ సమయంలో కేజీహెచ్‌కు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆస్పత్రిలోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి ఐసీయూలు, అత్యవసర విభాగాలు, వార్డులకు సరఫరా చేశాయి. అయితే నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలతో నాలుగు ప్లాంట్లు క్రమంగా మూతపడ్డాయి. చిన్నచిన్న మరమ్మతులు చేయిస్తే తిరిగి పనిచేసే అవకాశం ఉన్నా వాటిని అలాగే వదిలేయడంతో అవి దిష్టిబొమ్మలుగా మారాయి. ప్రస్తుతం కేవలం రెండు ప్లాంట్లపైనే ఆస్పత్రి భారం మొత్తం పడుతోంది.

రూ.60 లక్షల సమస్య.. కోట్ల భారం!

నాలుగు ప్లాంట్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావడానికి సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిపుణుల అంచనా. ప్రెషర్‌ గేజ్‌, డ్రయ్యర్‌, ఫిల్లర్‌, థర్మామీటర్‌, కంప్రెసర్‌, విద్యుత్‌ సెన్సార్లు తదితరాల్లో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. రూ.60 లక్షలతో పరిష్కరించగల సమస్య కోసం ప్లాంట్లను పక్కనపెట్టి బయట నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తున్నారు. నెలనెలా భారీ మొత్తాలు ఖర్చవుతుండగా.. ఏడాదికి ఈ వ్యయం కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ప్లాంట్లను బాగు చేయకుండా నిరంతర కొనుగోళ్లపై ఆధారపడటం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది.

కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతర్‌

ప్లాంట్ల దుస్థితిపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. నాలుగు ప్లాంట్లను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడిచినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. అత్యవసర వైద్య సేవకు సంబంధించిన అంశంలో కలెక్టర్‌ ఆదేశాలే అమలు కాకపోవడం అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

కమీషన్ల కక్కుర్తే కారణమా?

సొంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నా, బయటి నుంచి కొనుగోలు చేయడంలోని అంతరార్థంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్సిజన్‌ కొనుగోళ్ల వెనుక కొందరు అధికారులు, వైద్యులకు భారీగా కమిషన్లు ముడుతున్నాయని, ఆ వ్యాపార ప్రయోజనాల కోసమే ప్లాంట్ల మరమ్మతులను తొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆక్సిజన్‌ బిల్లులు చెల్లించలేక పేద రోగులు కేజీహెచ్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఇక్కడి అధికారుల అవినీతి అస్మదీయ ధోరణి ఆ పేద రోగుల ఊపిరిపై దెబ్బతీస్తోంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ప్లాంట్లకు మరమ్మతులు చేయించి కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించాలని బాధితులు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement