వరలక్ష్మీ నమోస్తుతే.. | - | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ నమోస్తుతే..

Aug 22 2026 1:53 AM | Updated on Aug 22 2026 1:53 AM

డాబాగార్డెన్స్‌: శ్రావణ శుక్రవారం సందర్భంగా విశాఖ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఇంటింటా మహిళలు కలశాలు ఏర్పాటు చేసి అమ్మవారిని కొలిచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మార్మోగగా.. భక్తులతో కిటకిటలాడాయి. ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొనగా.. నగరమంతా శ్రావణలక్ష్మీ నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

స్వర్ణాభరణాలంకరణలో కనకమహాలక్ష్మి

బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల నడుమ ఉదయం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మూలవిరాట్‌కు క్షీరాభిషేక సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పోస్టు ద్వారా వివరాలు పంపిన భక్తుల పేరిట అర్చనలు చేసి కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు.

పట్టు వస్త్రాలంకరణలో కన్యకాపరమేశ్వరి

కురుపాం మార్కెట్‌ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలోనూ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌కు 108 ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించి, 108 స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక నివేదన చేశారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. 250 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement