విశాఖ విద్య: విశాఖ విమానాశ్రయంలో దేశీయ విమాన సర్వీసులను కొనసాగించాలని కోరుతూ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి మెట్ట రామారావు, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు కుర్మాన చంద్ర మోహన్‌లు ఈ నెల 13న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు స్టీల్‌ప్లాంట్ జేఏసీ చైర్మన్ డి.ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కీలకమన్నారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడం వల్ల ప్రయాణికులపై అదనపు సమయం, ఖర్చుల భారం పడుతుందన్నారు. విశాఖలో దేశీయ విమాన సర్వీసులు కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సీపీఐ నాయకుడు ఎం.పైడిరాజు మాట్లాడుతూ విశాఖ–భోగాపురం మధ్య మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మథరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ పాల్గొన్నారు.


