క్లాసుల్లేని క్యాంపస్‌! | - | Sakshi
Sakshi News home page

క్లాసుల్లేని క్యాంపస్‌!

Aug 7 2026 12:38 AM | Updated on Aug 7 2026 12:38 AM

ఏయూ యాజమాన్యం మొండిపట్టు

వేలాది మంది విద్యార్థుల భవిత

ప్రశ్నార్థకం

అడ్‌హాక్‌ అధ్యాపకుల విషయంలో

తలో వైఖరి

హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్న

అధికారులు

వర్సిటీ తీరుపై గవర్నర్‌ కార్యాలయం

తీవ్ర అసంతృప్తి?

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధనా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వర్సిటీ యాజమాన్య నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక సంస్థపై విజిలెన్స్‌ విచారణ మకిలి అంటించి, ఉన్నత విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని మేధావులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ యాక్ట్‌ 91 ప్రకారం గవర్నర్‌ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వర్సిటీ ప్రతిష్ట కోర్టు మెట్లెక్కినా వెనక్కి తగ్గకుండా యాజమాన్యం దూకుడుగా వ్యవహరించడంపై గవర్నర్‌ కార్యాలయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఏయూలో చర్చ జరుగుతోంది.

నాక్‌ కోసం వాడుకుని.. నడిరోడ్డున పడేశారు!

గతంలో ఏయూలో అధ్యాపకుల కొరత వేధిస్తున్న సమయంలో, నాక్‌ ప్రమాణాలను కాపాడుకోవడంతో పాటు విద్యార్థులకు బోధనా లోపం రాకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఆమోదంతో 2022, 2023లలో అడ్‌హాక్‌ అధ్యాపకులను నియమించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల ద్వారా పారదర్శకంగా వీరందరినీ ఎంపిక చేశారు. ఇంజినీరింగ్‌, లా, జియాలజీ, పర్యావరణ శాస్త్రం, స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ వంటి సెల్ఫ్‌ సపోర్ట్‌ కోర్సులకు వీరే ప్రధాన బోధకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకున్నా, సాధారణ సిబ్బంది జీతాలతో సంబంధం లేకుండా.. వీరు నిర్వహించే కోర్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్‌ ప్రొఫెసర్ల లాగా వీరికి ఎలాంటి రీసెర్చ్‌ ఫండ్స్‌ కానీ, కాన్ఫరెన్స్‌ అలవెన్సులు కానీ ఉండవు. అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడేళ్లకు పైగా నిబద్ధతతో పనిచేసిన 25 మందికి పైగా అధ్యాపకులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఉన్నపళంగా పక్కనబెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

ఒకరికి రెన్యువల్‌.. మరొకరిపై కక్షసాధింపా?

ఇటీవల కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు సేవల రెన్యువల్‌ ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం, సుమారు 40 మంది వరకు ఉన్న అడ్‌హాక్‌, అడ్జంక్ట్‌ అధ్యాపకులకు మాత్రం రెన్యువల్‌ నిలిపివేసింది. ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధిత అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జూన్‌ 29న అడ్‌హాక్‌ అధ్యాపకులకు, జులై 31న అడ్జంక్ట్‌ అధ్యాపకులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మనీష్‌ గుప్తా వర్సెస్‌ అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రస్తావిస్తూ ‘ఒక కాంట్రాక్టు లేదా అడ్‌హాక్‌ ఉద్యోగి స్థానంలో మరో కాంట్రాక్టు, అడ్‌హాక్‌ ఉద్యోగిని భర్తీ చేయకూడదు. ఆ ఖాళీలను శాశ్వత పోస్టుల ద్వారా మాత్రమే నింపాలి’ అని స్పష్టం చేస్తూ, వీరిని తక్షణమే విధుల్లో కొనసాగించాలని ఆదేశించింది. అయినప్పటికీ, వర్సిటీ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను అమలు చేయకపోతే వర్సిటీ ఉన్నతాధికారులను నేరుగా కోర్టుకు పిలిపిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా?

అధికారుల పంతాలు, పట్టింపుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన నెల రోజులుగా సంబంధిత విభాగాల్లో బోధన పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ఏయూ క్యాంపస్‌కు వస్తున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సిలబస్‌ పూర్తికాక, మరోవైపు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభసాటిగా నడుస్తున్న స్వయం ఆర్థిక కోర్సులను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఏయూ అధికారుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement