మహారాణిపేట: ఓడరేవులు, లాజిస్టిక్స్ ఒకే నాణేనికి రెండు వైపులని, సముద్ర మార్గాలు, పారిశ్రామిక కేంద్రాలు, అంతర్గత మార్కెట్ల మధ్య సరుకు రవాణాను సమర్థవంతంగా అనుసంధానించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యుడు దేవేంద్ర కుమార్ అన్నారు. సీఐఐ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నోవోటెల్‌లో నిర్వహించిన సీఐఐ కాన్ఫరెన్స్ ఆన్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్–2వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ అనేక సంస్కరణలు చేపట్టిందని, వాటి వల్ల ఓడరేవులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశాఖలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు వల్ల నిర్ణయాల ప్రక్రియ వేగవంతమై, స్థానిక లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కంటైనరైజేషన్, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఓడరేవులు–రైల్వేలు–రోడ్ల సమన్వయమే సరుకు రవాణా అభివృద్ధికి కీలకమని చెప్పారు. సీఐఐ విశాఖ జోన్ చైర్మన్ జి.కృష్ణమోహన్, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు, ఏపీ మారిటైమ్ బోర్డు రైల్వే–లాజిస్టిక్స్ సలహాదారు ఆర్.ధనంజయులు, విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రధాన, ఐదు చిన్న ఓడరేవులు కలిసి ఏటా సుమారు 30 కోట్ల టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నాయని ధనంజయులు తెలిపారు. కార్యక్రమంలో సీఐఐ విశాఖపట్నం జోన్ వైస్ చైర్మన్ నిలేష్ అగర్వాల్, భద్రతా కార్యకలాపాల సలహాదారు శ్రీనివాస్ నందూరి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎ. నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సీజీఎస్టీ అదనపు కమిషనర్ బలరామ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెప్టెన్ ఎస్. దివాకర్, స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్ రాజశేఖర్, జీఎంఆర్ గ్రూప్ రీజినల్ కార్గో బిజినెస్ సీఈఓ ప్రసాద్, విజయనగరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఐఐ సదస్సులో రైల్వే బోర్డు ట్రాఫిక్
అదనపు సభ్యుడు దేవేంద్ర కుమార్


