సింహాచలం: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు శ్రీ త్రిపురాంతకస్వామి ఆలయంలో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుణ జపాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, త్రిశూలార్చన, రుష్యశృంగ ఆవాహన, దీక్షాధారణ, వేద పారాయణాలు, రుత్విగ్వరణం, వరుణ జపాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణం, వేద పారాయణాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చూర్ణికా పఠనం, ఆలయ బలిహరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొని వేద పండితులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. దేవస్థానం వేద పండితుడు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


