ఎంవీపీ కాలనీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య అభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం బలోపేతం దిశగా విశాఖ ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్ ఫోరం శనివారం చర్చలు జరిపింది. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం వేదికగా ఈ చర్చా సమావేశం జరిగింది. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో విశాఖ ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్ ఫోరం(వీఎఫ్‌వీసీఎఫ్) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన సమావేశంలో మాజీ వీసీలు ఆచార్య వి.బాలమోహన్‌దాస్, ఆచార్య ముత్యాల నాయుడు, ఆచార్య సుంకరి రామకృష్ణ, ఆచార్య కె.నిరుపమారాణి, ఆచార్య వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఆచార్య పి.శ్యాంప్రసాద్, ఆచార్య ఎస్.వి.సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఐఐఏఎం చైర్మన్ సుంకరి రవీంద్ర, రీడ్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ ఆచార్య వి.కృష్ణమోహన్‌లు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఫోరం కోసం 5 నుంచి 10 సంవత్సరాల విజన్, మిషన్ స్టేట్‌మెంట్ రూపొందించడంపై చర్చించారు. నాణ్యమైన విద్య, అధ్యాపకుల్లో నైపుణ్యాలు, విద్యార్థుల్లో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనల పెంపు, కొత్త ఆవిష్కరణల దిశగా ప్రోత్సాహం, సామాజిక బాధ్యత వంటి అంశాల్లో అభ్యసన విధానాలు బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు.


