ఉత్పత్తికి తగ్గ వేతనం
పని చేస్తేనే జీతం ఉంటుందంటూ యాజమాన్యం నిబంధనలు
ఉత్పత్తి చూపించకపోతే వేతనాల్లో కోతలు విధింపు
ఈ భయంతోనే పరిస్థితులు ఎలా ఉన్నా పనిచేస్తున్న కార్మికులు
చంద్రబాబు మార్క్ వంచన.. మరణశయ్యపై విశాఖ ఉక్కు
నాడు వీర నినాదాలు.. నేడు కేంద్రానికి వంతపాట
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలను జీతాలతో ముడిపెట్టడం వల్ల వేతనాల్లో కోతల భయంతో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మరోవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగులను బదిలీలు చేయడం, వీఆర్‌ఎస్ ద్వారా సిబ్బందిని తగ్గించడం వల్ల నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడి భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కులో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రైవేటీకరణ చర్యలు, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు కలిసి ప్లాంట్‌ను సంక్షోభంలోకి నెడుతున్నాయి. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేస్తున్న ఈ దుస్థితికి ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగవంతమైన ప్రైవేటీకరణ ప్రక్రియతో విశాఖ ఉక్కు మరణశయ్యపైకి చేరుకుంటోంది. 2021 జనవరిలోనే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ కమిటీ తీర్మానం చేయగా, వైఎస్సార్‌సీపీ పోరాటంతో అది అడుగు ముందుకు పడలేదు. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. గతంలో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని లక్షలాది మంది సాక్షిగా హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్,లోకేష్ సహా ఇతర నేతలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తిగా వంతపాడుతున్నారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిస్తూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికులను వంచనకు గురిచేస్తోంది.


